వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గడం సహజమే అనుకుంటాం. కానీ, జీవితంలో కొన్ని అనారోగ్య సమస్యలను నియంత్రించగలిగితే, డిమెన్షియా (చిత్త వైకల్యం) లేకుండా గడిపే సంవత్సరాలను పెంచుకోవచ్చా… అనే ప్రశ్నకు సమాధానం వెతికిన తాజా పరిశోధన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అమెరికాకు చెందిన న్యూరాలజీ అనే వైద్య పత్రిక ఇటీవల ప్రచురించిన పరిశోధన వివరాల ప్రకారం, మధ్య వయసులో పొగతాగడం, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో భవిష్యత్తులో చిత్త వైకల్యం లేకుండా గడిపే సంవత్సరాలు తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… పరిశోధకులు కేవలం వృద్ధాప్యంలో కనిపించే సమస్యలను మాత్రమే పరిశీలించలేదు. మధ్య వయసులోని ఆరోగ్య పరిస్థితులు తర్వాతి జీవితంలోని మెదడు ఆరోగ్యంతో ఎలా ముడిపడి ఉంటాయో గమనించారు. అంటే మెదడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన సమయం వృద్ధాప్యం వచ్చిన తర్వాత కాదు… అంతకంటే ముందే మొదలవుతుందన్న ఆలోచనకు ఈ పరిశోధన బలం చేకూరుస్తున్నది. 45 నుంచి 65 సంవత్సరాల మధ్య కాలంలో, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను వైద్యుల సూచనలతో నియంత్రించుకోవడం, పొగతాగడం మానేయడం వంటి మార్పులు గుండె ఆరోగ్యానికే కాకుండా భవిష్యత్తులో మెదడు ఆరోగ్యానికీ ఉపయోగపడే అవకాశం ఉందని ఈ పరిశోధన సూచిస్తున్నది.
పరిశోధనలో భాగంగా న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 55 ఏండ్ల వయసు కలిగి, డిమెన్షియా లేని 12 వేల మందిని దాదాపు దశాబ్దం పాటు పరిశీలించారు. వీళ్లు ప్రస్తావించిన మూడు అలవాట్లను సక్రమంగా పాటించగలిగితే మన జీవితంలో సుమారు 13 సంవత్సరాల పాటు డిమెన్షియా లేకుండా గడపవచ్చని చెబుతున్నారు. చిత్త వైకల్యానికి వయసు, జన్యువులు, జీవనశైలి, ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణమవుతాయి. కాబట్టి మెదడును కాపాడుకోవడం అంటే కేవలం జ్ఞాపకశక్తి వ్యాయామాలు చేయడం కాదు… మధ్య వయసు నుంచే మొత్తం శరీర ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా అన్నమాట!