Diabetes and Menopause | మెనోపాజ్.. చాలా ఏండ్ల పాటు క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి ఆగిపోయే టైమ్. మహిళల్లో పెద్ద వయసులో ఎదురయ్యే సాధారణ విషయం. నిజానికి ఇది ఇబ్బంది ఎంతమాత్రమూ కాదు. పెద్ద వయసులో మనకు ఎదురవనున్న పలు సమస్యలకు అలారంగా భావించాలి. కొన్నిరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే మహిళల్లో మెనోపాజ్ కాస్తా ఇబ్బంది పెడుతుందని నిపుణులు చెప్తున్నారు.
మహిళల్లో ఎంతో ముఖ్యమైన ఈ ప్రక్రియ క్రమపద్ధతిలో లేనట్లయితే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మోనోపాజ్ వల్ల మహిళలకు టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదమున్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో మధుమేహం ఉన్నవారిలో మెనోపాజ్ కాస్తా ముందుగానే కనిపిస్తుందని ఓ అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు.
మెనోపాజ్ సాధారణంగా 40 ఏండ్ల వయసు దాటిన మహిళల్లో, కొందరు మహిళల్లో 50 ఏండ్లు దాటిన తర్వాత కనిపిస్తుంది. ఇది పూర్తిగా జీవసంబంధమైన సాధారణ ప్రక్రియ. మధుమేహానికి, మెనోపాజ్‌కు సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. డయాబెటిస్ బారిన పడిన మహిళలు అకాల మెనోపాజ్ ఎదుర్కొంటారని తేల్చారు. పరిశోధకులు వృద్ధాప్యంపై కెనడియన్ లాంగిట్యూడినల్ స్టడీ కాంప్రహెన్సివ్ కోహోర్ట్ డాటాను తమ అధ్యయనానికి వినియోగించారు. ఇందులో 11,436 మంది మహిళలు మధుమేహంతో ప్రీ-మెనోపాజ్ నిర్ధారణతో ఉన్నారు. వీరంతా 45 నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే.
‘సహజమైన మెనోపాజ్‌లో వయస్సుతో ముడిపడి ఉన్న కోవేరియేట్లను సర్దుబాటు చేసిన తర్వాత కూడా టైప్ -2 మధుమేహం, ముందస్తు మెనోపాజ్ మధ్య సంబంధాన్ని గుర్తించాం. డయాబెటిస్తో బాధపడని మహిళలతో పోల్చితే.. మధుమేహం సమస్యను ఎదుర్కొంటున్నవారిలో ముందస్తు మెనోపాజ్ నిర్ధారణ జరిగింది’ అని టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన లీడ్ స్టడీ రచయిత వ్రతి మెహ్రా పేర్కొన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరుపుతున్నామని, పునరుత్పత్తి వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై తమ అధ్యయనం కొనసాగుతుందని చెప్పారు. టైప్-2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్దారణ అయినట్లయితే ప్రీమెచ్యూర్ మోనోపాజ్ను అనుభవించాల్సి ఉంటుందని ఆయనన్నారు.
టైప్-2 డయాబెటిస్ ఉన్న మహిళల్లో మెనోపాజ్ సగటు వయస్సు 44.65 సంవత్సరాలు అని పరిశోధకులు గుర్తించారు. అలాగే, నాన్ డయాబెటిక్ మహిళల్లో మెనోపాజ్ పెద్ద వయసులో.. సాధారణంగా 48.2 ఏండ్లకు వస్తుందని తమ అధ్యయనంలో కనుగొన్నారు. కాగా, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో రుతుస్రావం ఆగిపోయిన మహిళల్లో ఈస్ట్రోజెన్ థెరపీ ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటూ.. సిగరెట్ స్మోకింగ్ మానసి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మధుమేహాన్ని మేనేజ్ చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.