Moringa Leaves | మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కానీ మనం కొన్ని రకాల వృక్షాలను అంతగా పట్టించుకోము. అలాంటి వాటిల్లో మునగ చెట్టు ఒకటని చెప్పవచ్చు. మునగ చెట్టు నుంచి వచ్చే కాయలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వాటితో టమాటా కూర, పులుసు, చారు వంటివి తయారు చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే మునగ కాయలు మాత్రమే కాదు, మునగ ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. మునగాకులతో వంటలు తయారు చేయవచ్చు. లేదా పొడి రూపంలోనూ తీసుకోవచ్చు. మునగ ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకులను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా క్వర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ముఖంపై ముడతలు ఉండవు. యవ్వనంగా కనిపిస్తారు. అలాగే కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. మునగాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. గుండె పనితీరు మెరుగు పడుతుంది. మునగాకులను తినడం వల్ల అనేక పోషకాలు కూడా లభిస్తాయి. వీటిల్లో విటమిన్లు ఎ, సి, ఇ ఉంటాయి.
మునగాకుల్లో అనేక రకాల మినరల్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఐరన్, క్యాల్షియం, పొటాషియంను పొందవచ్చు. అలాగే వీటిని తింటే ప్రోటీన్లు కూడా లభిస్తాయి. ఇవన్నీ మనల్ని రోగాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులను తగ్గిస్తాయి. ఆరోగ్యంగా ఉండేట్లు చూస్తాయి. అలాగే ఈ ఆకులను తినడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మునగాకులను తినడం వల్ల షుగర్ లెవల్స్‌ను సైతం తగ్గించుకోవచ్చు. శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
మునగాకుల్లో అనేక రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం అనేది ఉండదు. ఈ ఆకులను తింటే విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మునగాకులను తింటే శరీరంలోని వాపులు సైతం తగ్గిపోతాయి. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా మునగాకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.