Curry Leaves | దాదాపుగా చాలా మంది ఇళ్లలోనూ కరివేపాకు చెట్టు ఉంటుంది. దీంతో వంటల్లోకి కరివేపాకు కావల్సి వచ్చినప్పుడు వెంటనే ఆ చెట్ల నుంచి ఆకులను తెంపి కూరల్లో వేస్తుంటారు. అయితే కూరల్లో కరివేపాకులను వేసే మాట వాస్తవమే అయినప్పటికీ చాలా మంది కరివేపాకును పక్కన పెట్టేస్తుంటారు. కరివేపాకును తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ కరివేపాకును పక్కన పెడితే అనేక లాభాలను కోల్పోయినట్లేనని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కరివేపాకులను ఉదయం పరగడుపునే తింటే అనేక ఆరోగ్య ప్రయోజనలను పొందవచ్చని, పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని వారు అంటున్నారు. కరివేపాకులను కొన్ని తీసుకుని రోజూ ఉదయం పరగడుపునే నమిలి తినాలని, దీంతో ఎన్నో లాభాలను పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
కరివేపాకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రోజూ సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నవారు రోజూ కరివేపాకులను నమలడం వల్ల అద్భుతమైన రిలీఫ్ వస్తుంది. దీంతోపాటు అసిడిటీ నుంచి కూడా బయట పడవచ్చు. కరివేపాకుల్లో కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి డ్యామేజ్ అయిన జుట్టున రిపేర్ చేస్తాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది. జుట్టు నల్లగా కూడా మారుతుంది. శిరోజాలకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి బయట పడవచ్చు.
కరివేపాకులను పరగడుపునే నమలడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. శరీరం ఇన్సులిన్‌ను మరింత వేగంగా గ్రహిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కరివేపాకులను తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. మనం తినే ఆహారాలలో ఉండే కొవ్వును శరీరం నిల్వ చేయకుండా చూసుకోవచ్చు. కరివేపాకులను తినడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. దీంతో శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కరివేపాకులను తినడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లోని వ్యర్థాలు సైతం బయటకు పోతాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. మద్యం అధికంగా సేవించేవారు కరివేపాకులను తింటే లివర్‌పై పడే ప్రభావం తగ్గుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. కరివేపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. దీంతో చర్మం కాంతి పెరుగుతుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. కరివేపాకులను తింటే శరీర రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కనుక రోజూ కరివేపాకులను పరగడుపునే తినడం మరిచిపోకండి.