ముంబై : కరోనా కట్టడికి కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు తీసుకునేలా ముస్లింలను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. పలు ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకునేందుకు ప్రజలు ముందుకురావడం లేదని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె తెలిపారు.
ముస్లింలను వ్యాక్సిన్లు తీసుకునేలా ప్రోత్సహించేందుకు సల్మాన్ ఖాన్‌తో పాటు మతపెద్దల సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేగం చాలా తక్కువగా ఉందని చెబుతూ ప్రజలపై ప్రభావం చూపే మతగురువులు, సినీ నటుల సేవలు తీసుకుని టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామని అన్నారు. సల్మాన్ ఖాన్ వంటి నటులు ప్రజలు వ్యాక్సిన్లు తీసుకునేలా ప్రోత్సహించాలని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ పేర్కొన్నారు.