మారుతున్న జీవనశైలి.. మనిషిని మంచాన పడేస్తున్నది. అవసరమైన పోషకాలు లేక.. శరీరం రోగాల పుట్టగా మారుతున్నది. చీటికీమాటికీ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నది. ముఖ్యంగా, ‘మెగ్నీషియం’ లోపంతో నవతరం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది. రోజువారీ జీవితంలో కీలకపాత్ర పోషించే మెగ్నీషియం.. మనిషి శరీరంలో జరిగే సుమారు 300 రకాల రసాయనిక చర్యల్లో కీలకపాత్ర పోషిస్తుంది. అలాంటి మెగ్నీషియం లోపిస్తే.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ లెక్కల ప్రకారం.. ప్రతిరోజూ పురుషులకు 400 మి.గ్రా., మహిళలకు 300 మి.గ్రా. మెగ్నీషియం అవసరమవుతుంది. రోజువారీగా తీసుకునే ఆహారం ద్వారా ఇది శరీరానికి అందుతుంది. అయితే, శరీరానికి తగినంత మెగ్నీషియం అందకపోతే.. మనిషిలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ముందుగానే గుర్తించి, వైద్యుణ్ని సంప్రదిస్తే మంచిది.
శరీరంలో మెగ్నీషియం తగినంత పరిమాణంలో ఉంటేనే.. హృదయ స్పందనలు సక్రమంగా సాగుతాయి. లేకుంటే.. హార్ట్‌రేట్ రూటు మారుతుంది. గుండె దడగా అనిపిస్తుంది. ఊపిరి పీల్చుకోవడంలోనూ ఇబ్బంది కలుగుతుంది.
వికారంగా అనిపించినా, ఆకలి లేకపోయినా.. మీ శరీరంలో మెగ్నీషియం లోపం ఉన్నట్టే! జీర్ణాశయం సజావుగా పనిచేయడంలోనూ మెగ్నీషియం పాత్ర ఉంటుంది. శరీరంలో మెగ్నీషియం తగ్గితే.. జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
శరీరంలో తగినంత మెగ్నీషియం లేకుంటే.. కంటి సమస్యలూ చుట్టుముడతాయి. కళ్ల మంట, కళ్ల నుంచి నీరుకారడం లాంటి సమస్యలు కనిపిస్తాయి.
కండరాల ఆరోగ్యం, పనితీరులో మెగ్నీషియం కీలకంగా వ్యవహరిస్తుంది. ఇది శరీరంలో తగినంతగా లేకపోతే తీవ్రమైన కండరాల నొప్పి, తిమ్మిరి వేధిస్తాయి.
మెగ్నీషియం లోపం.. మనిషికి నిద్రను దూరం చేస్తుంది. నిద్రలేమితోపాటు తలనొప్పి, చికాకు ఇబ్బంది పెడుతాయి.
ఎముకలు, నరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, వాటి పనితీరు బాగుండాలన్నా.. కావాల్సినంత మెగ్నీషియం ఉండాల్సిందే! కాల్షియం కూడా చాలా అవసరం. ఈ ఖనిజాలలో అసమతుల్యత కండరాల తిమ్మిరి, కండరాల నొప్పికి కారణమవుతుంది. కాల్షియం, మెగ్నీషియం రెండిటినీ సమతుల్యంగా ఉంచుకోవడం చాలా అవసరం.
మెగ్నీషియం లోపం ఉన్నవారు రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. గుమ్మడి గింజలు, పాలకూర, బచ్చలికూర, అరటిపండ్లు, నల్ల జీలకర్ర, పల్లీలు, బ్రౌన్ రైస్, సాల్మన్ చేపల్లో మెగ్నీషియం ఎక్కువగా దొరుకుతుంది. జీడిపప్పు, బాదంపప్పు, అవకాడో, నట్స్, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు, బీన్స్, పప్పు దినుసులు, పచ్చి బఠానీలు, శనగలు, పాలు, పెరుగు, సోయా ఉత్పత్తుల్లోనూ మెగ్నీషియం లభ్యమవుతుంది. బెర్రీలు, అంజీర్, బ్రకోలీ, క్యాబేజీ, మొలకలలోనూ మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇక శరీరంలో మెగ్నీషియం తక్షణమే ఉత్పత్తి కావాలంటే.. ఒక కప్పు కాఫీ తాగడమో.. ఒక డార్క్ చాక్లెట్ తినడమో చేయాలి.