ఒకప్పుడు ధూమపానం, పరిశ్రమల్లో పని చేసేవాళ్లకే శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా యువత ఊపిరితిత్తులు ఇబ్బందుల్ని పీల్చుకుంటున్నాయి. అందుకు కారణాలు అనేకం..
నగరాల్లో కాలుష్యం: రోజురోజుకీ వాయు కాలుష్యం బాగా పెరుగుతున్నది. ముఖ్య పట్టణాల్లో వాహనాల వాడకం పెరగడం, పరిశ్రమలు పెరగడం వల్ల గాలి నాణ్యత తగ్గిపోతున్నది. కాలుష్యపూరితమైన గాలిని పీల్చడం.. రోజూ ఒక సిగరెట్ ప్యాకెట్ తాగడంతో సమానమని నిపుణులు చెబుతున్నారు. గాలి ద్వారా చిన్నచిన్న పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5), వాహనాల వ్యర్థ వాయువులు మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. దానిద్వారా దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్, శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి.
ఇంట్లోనూ కలుషిత గాలే: ఇంట్లోని గాలి కూడా అన్నిసార్లు సురక్షితం కాదు. రసాయనాలతో తయారు చేసిన క్లీనింగ్ ప్రొడక్ట్స్, దోమల బత్తీలు, అగర్బత్తీలు, సెంటెడ్ క్యాండిల్స్ లాంటివి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయి. ఇంట్లో, ఆఫీసు గదుల్లో సరైన వెంటిలేషన్ లేకపోయినా ఈ సమస్యలు తప్పవు.
ఇ-సిగరెట్స్: ధూమపానం కన్నా వేపింగ్ (ఇ-సిగరెట్స్) సురక్షితమని ప్రస్తుత యువత భావిస్తున్నది. కానీ ఇ-సిగరెట్లు కూడా ఊపిరితిత్తుల సమస్యలకు కారణం అవుతున్నాయని తాజా పరిశోధనలు రుజువు చేశాయి. చాలా కేసుల్లో వేపింగ్ వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణించి మరణించిన వారూ ఉన్నారు.
పనిచోట ప్రమాదం: నిర్మాణ పనులు, పరిశ్రమలు, బ్యూటీ పార్లర్లలో పని చేసేవారు రోజూ వివిధ రకాల రసాయనాల మధ్యే జీవిస్తుంటారు. చాలాచోట్ల రక్షణ పరికరాలు లేకుండా పనులు జరుగుతుంటాయి. దాంతో తీవ్ర ఊపిరితిత్తుల సమస్యల బారిన పడాల్సి వస్తున్నది.
ఆస్తమా నిర్ధారణలో ఆలస్యం: ఆస్తమా ఉన్నట్లు గుర్తించకపోవడం, తెలిసినా వైద్యం తీసుకోకపోవడం లాంటివి ఊపిరితిత్తుల సమస్యలకు కారణాలు అవుతున్నాయి. ధూమపానం చేయని వారు పెంపుడు జంతువులు, గాల్లోని పుప్పొడి, కాలుష్య కారకాల వల్ల శ్వాసకోశ సమస్యలు
ఎదుర్కొంటున్నారు.