Lung Cancer | కోవిడ్-19 దీర్ఘకాలిక ప్రభావాల గురించి ఇప్పటికే అనేక అధ్యయనాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్ర అలసట, బ్రెయిన్ ఫాగ్, శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత ఇబ్బందులు వంటి సమస్యలు దీని తరువాత కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, తీవ్రమైన కోవిడ్-19 లేదా ఇన్ఫ్లుయెంజా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు భవిష్యత్తులో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధనను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా హెల్త్ సిస్టమ్ శాస్త్రవేత్తలు నిర్వహించి, సెల్ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించారు. తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్లు శరీరంలోని ఇమ్యూన్ కణాలను రీప్రోగ్రామ్ చేస్తాయి. దీని వల్ల ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక వాపు ఏర్పడి, ట్యూమర్ పెరుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ పరిస్థితి సంవత్సరాల పాటు కొనసాగవచ్చని పరిశోధకులు వెల్లడించారు.
కోవిడ్ లేదా ఫ్లూ తీవ్రంగా వచ్చిన వారికి తరువాత కాలంలో ఊపిరితిత్తుల్లో వాపు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చేందుకు దారి తీస్తుందని పేర్కొన్నారు. అయితే టీకాలు తీసుకోవడం వల్ల ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాల్లో అగ్రస్థానంలో ఉంది. పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ ఇది అధిక మరణాలకు కారణమవుతోంది. ఎక్కువ సందర్భాల్లో ఈ వ్యాధి ఆలస్య దశల్లో గుర్తించబడడటం వల్ల చికిత్స అవకాశాలు పరిమితం అవుతున్నాయి. అయితే ప్రమాదంలో ఉన్న వ్యక్తులను ముందుగానే స్క్రీనింగ్ చేయడం ద్వారా జీవనావకాశాలను మెరుగుపరచవచ్చని WHO సూచిస్తోంది. ఈ అధ్యయనంలో భాగంగా చేసిన ప్రయోగాల్లో తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకున్న జంతువుల్లో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరిగినట్లు కనిపించింది. అలాగే మనుషులపై సేకరించిన డేటాలో కూడా ఆసుపత్రిలో చికిత్స పొందిన కోవిడ్ రోగుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ 1.24 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే స్వల్ప ఇన్ఫెక్షన్లు ఈ ప్రమాదాన్ని పెంచలేదని పరిశోధకులు వెల్లడించారు.
మరో కీలక అంశంగా తీవ్రమైన వైరల్ న్యుమోనియా ఊపిరితిత్తుల కణజాలాన్ని మారుస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రో-ట్యూమర్ వాతావరణాన్ని సృష్టించి ట్యూమర్ పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఈ మార్పులు నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగవచ్చని అధ్యయనం సూచిస్తోంది. ఇప్పటి వరకు పొగ తాగడం వంటి కారణాలు మాత్రమే ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రమాదంగా భావించారు. అయితే ఈ తాజా ఫలితాల ప్రకారం తీవ్రమైన శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా అదే విధంగా పరిగణించాల్సిన అవసరం ఉందని నిపుణులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి రోగులకు సిటి స్కాన్ల ద్వారా క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం కావచ్చని నిపుణులు సూచించారు.
జీవశాస్త్ర పరంగా పరిశీలిస్తే తీవ్రమైన ఇన్ఫెక్షన్ల తర్వాత న్యూట్రోఫిల్స్, మాక్రోఫేజ్‌లు వంటి ఇమ్యూన్ కణాలు అసాధారణ స్థితిలోకి మారుతున్నాయి. ఇవి క్యాన్సర్‌ను నిరోధించే శక్తిని తగ్గించి వాపును పెంచుతాయి. అలాగే ఊపిరితిత్తుల కణజాలం కూడా మార్పులకు లోనై, మ్యూటేషన్లకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇదిలా ఉంటే టీకాలు ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. ముందుగా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు తగ్గడంతోపాటు ఊపిరితిత్తుల్లో జరిగే హానికర మార్పులు కూడా తగ్గినట్లు గుర్తించారు. తీవ్రమైన కోవిడ్-19 లేదా ఇతర వైరల్ న్యుమోనియా నుంచి కోలుకున్నవారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా పొగ తాగే అలవాటు ఉన్నవారు లేదా ఇతర ప్రమాద కారకాలు ఉన్నవారు వైద్యుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం అవసరం. టీకాలు తీసుకోవడం ద్వారా కేవలం తక్షణ రక్షణ మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.