చాలామంది అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)తో బాధపడుతుండటం తెలిసిన విషయమే. అయితే, కొంతమంది మాత్రం లో బీపీతో బాధపడుతుంటారు. దీన్ని వైద్య పరిభాషలో హైపోటెన్షన్ అంటారు. రక్త పీడనం స్థాయులు సాధారణం కంటే తక్కువకు పడిపోయినప్పుడు ఈ స్థితి తలెత్తుతుంది. అంటే బీపీ 90/ 60 ఎంఎం హెచ్‌జీ కంటే తక్కువగా నమోదవుతుంది. లో బీపీ వివిధ కారణాల వల్ల తలెత్తుతుంది. డీహైడ్రేషన్, గుండె సమస్యలు, వాడుతున్న మందులు లాంటివి లో బీపీకి కొన్ని కారణాలు. కొన్ని లక్షణాలను గుర్తిస్తేలో బీపీని పసిగట్టవచ్చు. అవేంటంటే…
లో బీపీకి చాలా సాధారణమైన సంకేతం తలతిప్పడం (కండ్లు తిరగడం) లేదా తల తేలిగ్గా ఉండటం. మరీ ముఖ్యంగా తొందరగా లేచే ప్రయత్నం చేసినప్పుడు ఇలా ఉంటుంది. రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో మెదడుకు రక్త ప్రసారం తగ్గిపోతుంది. దీంతో తల తిరిగినట్టుగా లేదా అస్థిరంగా అనిపిస్తుంది.
చూపు మసకగా, తెరలుగా కనిపించడం కూడా లో బీపీ సంకేతమే. రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయినప్పుడు ఇలా జరుగుతుంది. మెదడులాగా కండ్లకు కూడా నిరంతరం రక్త సరఫరా జరుగుతూ ఉండాలి. అయితే, రక్తపోటు స్థాయులు పడిపోయినప్పుడు కండ్లు ఆక్సిజన్‌ను
సరిపోయినంతగా స్వీకరించలేవు. ఇది చూపునకు సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది.
లో బీపీ ఉన్నప్పుడు ఎడతెగని అలసట, కండరాల బలహీనత పీడిస్తాయి. రక్తపోటు స్థాయులు పడిపోవడంతో మన శరీరంలోని అవయవాలు, కండరాలు తగినంత ఆక్సిజన్‌ను, పోషకాలను గ్రహించలేవు. దీంతో అలసటగా, నిస్ర్తాణగా అనిపిస్తుంది.
రక్తపోటు పడిపోయినప్పుడు మన శరీరం మెదడు, గుండె లాంటి కీలకమైన అవయవాలకు రక్తాన్ని పంపించడం మీద దృష్టి సారిస్తుంది. ఇది చర్మం, చేతులు, కాళ్లు పాలిపోవడానికి, చల్లబడటానికి దారితీస్తుంది. చర్మం కూడా చెమటగా, జిగటగా తయారవుతుంది. శరీరం ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి, ఇలా జరుగుతుంది.
రక్తపోటు స్థాయులు పడిపోయినప్పుడు రక్త ప్రసారం సరిగ్గా జరగడానికి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది గుండె కొట్టుకోవడాన్ని క్రమరహితంగా లేదంటే బాగా వేగంగా మారుస్తుంది. ఇది ఒక్కోసారి తక్కువ, మరీ తక్కువ శ్వాస (షాలో బ్రీతింగ్)తో కూడా జరగవచ్చు.
బీపీ అంటే మన శరీరంలో ధమనుల్లో రక్తం ప్రవహించే పీడనం. గుండె కొట్టుకున్నప్పుడు రక్తం ధమనుల్లో చేరుతుంది. వీటి ద్వారా శరీరం అంతటికీ ప్రసారమవుతుంది. అయితే, మన రక్తపోటు అన్నివేళలా ఒకేలా ఉండదు. వయసు, మందులు తదితర కారణాల వల్ల అది మారుతూ ఉంటుంది. ఇక పైన వివరించిన లో బీపీ లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యుణ్ని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి.