ప్రేమ ఓ ఆరోగ్య సంకేతం. ప్రేమలో పడ్డామంటేనే పరిపూర్ణ చైతన్యంతో ఉన్నట్టు. మరింత ఆరోగ్యానికి ఇంకొంత ప్రేమించాలి. లవ్ థెరపీ గురించి సైకాలజిస్టులు చాలా సందర్భాల్లో చాలా విషయాలే చెప్పారు. (నేడు వాలెంటైన్స్ డే)
ప్రేమ ఊట.. ఆక్సిటోసిన్ హార్మోన్! మిగిలినవారితో పోలిస్తే ప్రేమికుల్లో ఆక్సిటోసిన్ ఓ చెంచాడు ఎక్కువే ఉంటుంది. ఈ రసాయనం ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీని జీవిత లక్ష్యానికి మళ్లించుకుంటే.. ఘన విజయాలు సాధించవచ్చు. ప్రేమను గెలిపించుకోవడానికే.. పతకాలు సాధించినవారు, సర్కారీ కొలువులు సొంతం చేసుకున్నవారు, కుబేరులైనవారు.. ఎంతోమంది. ప్రేమంటేనే ఓ పరీక్ష. గెలుస్తామో లేదో అనే భయం, పెద్దల్ని ఒప్పిస్తామో లేదో అనే అనుమానం, సమాజాన్ని ఎదిరించగలమో లేదో అనే జంకు. ఇవన్నీ కలిసి ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ విడుదలను పెంచుతాయి. కింది నుంచి మంట పెడితేనే రాకెట్ నింగికి ఎగురుతుంది. ఒత్తిడి పెరిగితేనే ప్రేమయాత్ర కూడా ఊపు అందుకుంటుంది.
ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్.. హార్మోన్లు ప్రేమికులతో దాగుడుమూతలు ఆడతాయి. అప్పటివరకూ బొద్దింకను చూసినా వణికిపోయే అమ్మాయి.. ఏకంగా ప్రపంచంతో పోరాటానికి సిద్ధపడుతుంది. నిన్నమొన్నటి దాకా గల్లీ రౌడీలా పోజు లిచ్చిన అబ్బాయి.. మహా బుద్ధిమంతుడిలా మారిపోతాడు. కారణం.. ఆ ప్రత్యేక సందర్భంలో.. ఆమెలో టెస్టోస్టెరాన్ హార్మోన్, అతనిలో ఈస్ట్రోజెన్ హార్మోన్.. ఊట పెరగడమే. ప్రేమికులకు ప్రకృతి అందించే ఆయుధ సంపత్తి ఇది. ఆ సరికొత్త ఎనర్జీ జీవన పోరాటంలోనూ పనికొస్తుంది. మరో ప్రేమ హార్మోన్ వాసోప్రెసిన్. ఇది నెగెటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది.
పాజిటివ్ దృక్పథాన్ని పెంచుతుంది. వలపు యోగంయోగా, ప్రేమ.. రెండూ వేరువేరు విషయాలే అయినా.. కొన్ని ఆసనాలు ప్రేమలో మలి అధ్యాయమైన దాంపత్య జీవితాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వజ్రోలి, అశ్వినీ ముద్ర అంగస్తంభన, స్ఖలన సమస్యలను దూరం చేస్తాయంటారు. శీర్షాసనం, వజ్రాసనం, భద్రాసనం, పశ్చిమోత్తానాసనం, వక్రాసనం, సేతుబంధాసనం.. ఆలూమగలు కలిసి సాధన చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందంటారు.
కొన్ని త్యాగాలూ..
ప్రేమ వందేండ్ల పంట. పరిపూర్ణ ఆరోగ్యంతోనే ఆ ఫలాలను ఆస్వాదించగలం. మద్యం, ధూమపానం తదితర వ్యసనాలను వదిలించుకోవాలి. పిజ్జా కార్నర్లలోనో, బర్గర్ సెంటర్లలోనో కాకుండా.. మిల్లెట్ రెస్టరెంట్లోనో, ఆర్గానిక్ కెఫేలోనో కూర్చుని కబుర్లు చెప్పుకోవాలి. నెలకో కేజీ చొప్పునో, ఆరు నెలల్లో ఐదు కేజీల చొప్పునో బరువు తగ్గించుకుంటామని ప్రమాణాలు చేసుకోవాలి. ఒకరి కోసం ఒకరు కంప్లీట్ హెల్త్ చెకప్ ప్యాకేజీని.. వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఇచ్చుకోవాలి. పరిపూర్ణ ఆరోగ్యంతోనే పరిపూర్ణ ప్రేమ సాధ్యం. హ్యాపీ వాలెంటైన్స్ డే.. హెల్దీ వాలెంటైన్స్ డే!