Mangoes | వేసవిలో మామిడి పండ్ల మీద మనసు పారేసుకోని భారతీయులు ఉండరు. దాదాపు 1,500 రకాలతో.. ప్రపంచంలో సగానికిపైగా మన దేశమే ఉత్పత్తి చేస్తున్నది. ఈ మధుర ఫలాలకు ఆరువేల ఏండ్ల చరిత్ర ఉంది. కానీ, ఎవరు తినాలి? ఎవరు తినకూడదు? రోజుకు ఎన్ని పండ్లు అయితే ఫర్వాలేదు.. ఇలా ఎన్నో సందేహాలు.
మామిడిపండు సహా ఏ ఫలమైనా మధుమేహం నియంత్రణలో ఉన్నవారికి నిషిద్ధమేం కాదు. చాలా పండ్లలో ఫైబర్ ఉంటుంది. దీంతో వాటిలోని చక్కెర రక్తంలో కలిసే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అయితే, రక్తంలో చక్కెర స్థాయుల గురించి సమాచారం సరిగ్గా లేకపోయినా, చక్కెర స్థాయులు ఎక్కువగా ఉన్నా కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే మామిడిపండ్లను దూరం పెట్టడమే మంచిది.
ఎప్పుడూ మామిడిపండును భోజనం తర్వాత డెజర్ట్‌గా తీసుకోవద్దు. అప్పటికే కేలరీలు, కార్బొహైడ్రేట్లు శరీరంలో చేరిపోయి ఉంటాయి కాబట్టి.. పొట్టమీద మరింత భారం పడుతుంది. బ్రేక్‌ఫాస్ట్ – మధ్యాహ్న భోజనం మధ్యలో కానీ, మధ్యాహ్న భోజనం – రాత్రి భోజనం మధ్యలో కానీ తీసుకుంటే మంచిది. అలా మామూలు స్నాక్స్ స్థానాన్ని మామిడిపండుతో భర్తీ చేసుకోవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు రోజుకు 150 నుంచి 200 గ్రాముల కార్బొహైడ్రేట్లు తీసుకోవచ్చు. వీటిలో పండ్ల నుంచి గరిష్టంగా 30 గ్రాములే ఉండాలనేది డాక్టర్ల సిఫారసు. 100 గ్రాముల మామిడిపండులో 15 గ్రాముల కార్బొహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయులను పెంచే ైగ్లెసిమిక్ ఇండెక్స్ 50 నుంచి 55 వరకు ఉంటుంది. మామిడిపండు కూడా రక్తంలో చక్కెరను పెంచుతుంది. కానీ, వైట్ బ్రెడ్ అంత వేగంగా మాత్రం కాదు. కాబట్టి ఓ మోస్తరు మామిడిపండ్లను అప్పుడప్పుడూ తీసుకోవచ్చు. ఆ సమయంలో మిగతా ఫలాలను దూరం పెట్టాలి. కార్బొహైడ్రేట్లు కూడా పరిమితి దాటకుండా జాగ్రత్త పడాలి.
యోగర్ట్, బాదం, వాల్నట్స్ లాంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న పదార్థాలతో కలిపి మామిడిపండును తీసుకోవచ్చు. ఇవి చక్కెరను రక్తం శోషింపజేసుకోవడాన్ని నెమ్మదింపజేస్తాయి. మామిడితోపాటు కూరగాయలు, కొన్ని గింజలతో సలాడ్‌గా తీసుకున్నా మంచిదే.
డబ్బాల్లో అమ్మే పండ్లరసాల్లో చక్కెరలు ఎక్కువ. పోషకాలు తక్కువ. కాబట్టి, తాజా పండ్లే ఉత్తమం. ఫైబర్ లేకపోతే చక్కెరలు రక్తంలో తొందరగా కలిసిపోతాయి. అంతేకాదు, ఒక గ్లాసు రసం తయారు చేయాలంటే మూడు నుంచి నాలుగు పండ్లు అవసరం. రసం తీసే క్రమంలో పండ్లలో ఉండే ఫైబర్ మాయమైపోతుంది. అంటే పండ్ల రసాలు తాగితే.. చుక్క ఫైబర్ కూడా అందదు. చక్కెర మాత్రం భారీగా శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి, పండ్లరసాలకు నో చెప్పడమే ఉత్తమం. ఇలా కొన్ని నియమాలను పాటిస్తూ డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా మామిడి మజాను ఆస్వాదించవచ్చు.
165 గ్రాముల మామిడిపండు ముక్కల్లో పోషకాల విలువ ఇలా ఉంటుంది..
☞ కేలరీలు: 99 కిలో కేలరీలు.
☞ ప్రొటీన్లు: 0.8 నుంచి 1 గ్రా.
☞ కొవ్వులు: 0.63 గ్రా.
☞ కార్బొహైడ్రేట్లు: 24.8 గ్రా.
☞ ఫైబర్: 2.64 గ్రా.
☞ పొటాషియం: 277 మిల్లీ గ్రా.
☞ విటమిన్ సి: 60.1 మిల్లీ గ్రా.
☞ విటమిన్-ఎ, ఆర్ఏఈ: 89.1 మైక్రో గ్రా. (ఎంసీజీలు).
☞ బీటా కెరోటిన్: 1,060 ఎంసీజీలు.
☞ ల్యూటీన్, జియాజాంథిన్: 38 ఎంసీజీలు.
☞ ఫోలేట్: 71 ఎంసీజీలు.
ఇవే కాకుండా, మామిడిపండ్లలో మెగ్నీషియం, కాపర్, ఒమేగా 3, 6 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి.
“పసుపు రంగులో కాకుండా డిఫరెంట్ కలర్లో ఉన్న ఈ మామిడి ధర లక్షల్లో ఎందుకు ఉంది?”