Kiwi In Monsoon | వర్షాకాలం అనేక రకాల రోగాలకు కారణమవుతుంది. ఈ సీజన్లో జాగ్రత్తగా లేకపోతే అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం ఈ సీజన్లో కామన్‌గా వస్తూనే ఉంటాయి. ఇక దోమలు కుట్టడం వల్ల చికెన్ గున్యా, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వస్తాయి. అలాగే కలుషిత ఆహారం తిన్నా, నీళ్లు తాగినా టైఫాయిడ్ వస్తుంది. సాధారణంగా చిన్నారులు లేదా పెద్దలు ఎవరికైనా సరే వర్షాకాలంలోనే ఎక్కువగా రోగాలు వస్తుంటాయి. అయితే ఈ సీజన్లో రోగాల నుంచి రక్షణ పొందేందుకు గాను అన్ని రకాల జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ్రమైన ఆహారాన్నే తినాలి. తినే ముందు కచ్చితంగా చేతులను శుభ్రం చేసుకోవాలి. అలాగే దోమలు వ్యాపించకుండా నివారణ చర్యలు చేపట్టాలి. ఇక ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలోనే రోగ నిరోధక శక్తిని పెంచే కివీ వంటి పండ్లను తినాలి. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
వర్షాకాలంలో మనకు దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇవి రాకుండా ఉండాలన్నా, వచ్చిన రోగాలు త్వరగా తగ్గాలన్నా మనకు రోగ నిరోధఖ శక్తి ఎక్కువగా ఉండాలి. కివీ పండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నారింజ పండ్ల కన్నా కివి పండ్లలోనే విటమిన్ సి మనకు అధికంగా లభిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో శరీరం రోగాలు, ఇన్ఫెక్షన్లపై పోరాటం చేస్తుంది. రోజూ కివీ పండ్లను తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. జ్వరం నుంచి కూడా త్వరగా కోలుకుంటారు. ఇక వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, ఫుడ్ పాయిజనింగ్ ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు కివి పండ్లను తింటుంటే మేలు జరుగుతుంది. కివి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల్లో ఆహారం లేదా మలం కదలికలను సులభతరం చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.
డెంగీ జ్వరం వచ్చిన వారు కివి పండ్లను తింటుంటే త్వరగా కోలుకుంటారు. డెంగీ వల్ల రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతుందన్న విషయం తెలిసిందే. అయితే కివి పండ్లను తింటుంటే తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి ప్లేట్లెట్స్ తయారు అయ్యేలా చేస్తాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఐరన్ వల్ల రక్తం తయారవడం మాత్రమే కాదు, ప్లేట్లెట్ల ఉత్పత్తి సైతం పెరుగుతుంది. కివి పండ్లలో ఉండే ఫోలేట్ ఎర్ర రక్త కణాల తయారీకి దోహదం చేస్తుంది. దీంతో ప్లేట్లెట్లు వృద్ధి చెందుతాయి. డెంగీ నుంచి త్వరగా కోలుకుంటారు. కివి పండ్లను యాంటీ ఆక్సిడెంట్లకు నిలయంగా చెప్పవచ్చు. ఈ పండ్లలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలను రక్షిస్తాయి. ముఖ్యంగా ఈ పండ్లలో ఉండే పాలిఫినాల్స్ ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో వాపులు తగ్గుతాయి. అలాగే వర్షాకాలం సీజనల్‌గా వచ్చే వ్యాధులు తగ్గిపోతాయి.
వర్షాకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. దీని వల్ల అనేక రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఫంగస్, వైరస్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కానీ కివి పండ్లను తింటే విటమిన్ సి లభిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు సైతం తొలగిపోతాయి. కివి పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. శరీరం ఇన్సులిన్ ను మరింత సమర్థవంతంగా వాడుకునేలా చేస్తాయి. దీంతో షుగర్ తగ్గి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా కివి పండ్లను వర్షాకాలంలో తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.