Kidney Stones | ఒకప్పుడు కిడ్నీ స్టోన్లు కేవలం పురుషులకే అది కూడా 50 ఏళ్లకు పైబడిన వారికే వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా కిడ్నీ స్టోన్లు వస్తున్నాయి. అలాగే కిడ్నీ స్టోన్ల బారిన పడుతున్నవారిలో మహిళలు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. కిడ్నీ స్టోన్లు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. వంశపారంపర్యంగా కిడ్నీ స్టోన్లు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు ఉండడం, కిడ్నీ వ్యాధులతో బాధపడుతుండడం, థైరాయిడ్ సమస్యలు ఉండడం, నీళ్లను తక్కువగా తాగడం, ఆహారం, వేడి వాతావరణంలో నివసించడం, క్యాల్షియం ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం, విటమిన్ డిని అధికంగా తీసుకోవడం, యూరిక్ యాసిడ్‌ను అధికంగా తయారు చేసే ఆహారాలను తినడం.. ఇలా పలు కారణాల వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడుతుంటాయి.
కిడ్నీ స్టోన్లు మొత్తం నాలుగు రకాలుగా ఉంటాయి. మనం తినే ఆహారంలో ఉండే క్యాల్షియంతో ఏర్పడే స్టోన్లు ఒక రకం కాగా, ఆగ్జలేట్స్ కారణంగా ఏర్పడేవి రెండో రకం స్టోన్లు, అలాగే ఫాస్ఫేట్ స్టోన్లు కూడా ఏర్పడుతాయి. కొన్ని సందర్భాల్లో క్యాల్షియం ఇతర సమ్మేళనాలతో కలిసి స్టోన్లను ఏర్పరుస్తుంది. దీంతో క్యాల్షియం ఆగ్జలేట్ లేదా క్యాల్షియం ఫాస్ఫేట్ స్టోన్లు ఏర్పడుతాయి. కిడ్నీల్లో వ్యర్థాలు ఎక్కువ సేపు ఉండడం వల్ల అక్కడ మూత్రంలోని పదార్థాలు అన్నీ కలిసి దృఢమైన పదార్థంగా ఏర్పడుతాయి. ఇవి రాళ్ల మాదిరిగా ఉంటాయి. కనుకనే వీటిని కిడ్నీ స్టోన్లు అంటారు. కిడ్నీ స్టోన్లు ఇసుక రేణువులంత చిన్న సైజ్ నుంచి గోల్ఫ్ ఆడే బంతి వరకు పెద్ద సైజ్‌లో కూడా ఉంటాయి.
చిన్న సైజ్‌లో ఉండే కిడ్నీ స్టోన్లు ఉంటే మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇలాంటి స్టోన్లు ఉన్నట్లు కూడా మనకు తెలియదు. ఇవి సాధారణంగా మూత్రంతోపాటు బయటకు వెళ్లిపోతాయి. ఇవి బయటకు వస్తున్నట్లు కూడా తెలియదు. కానీ పెద్దగా ఉండే స్టోన్ల వల్ల విపరీతమైన నొప్పి ఏర్పడుతుంది. పొత్తి కడుపు కింది భాగంలో కుడి లేదా ఎడమ వైపు నొప్పి ఉంటుంది. అదే భాగంలో వెనుక వైపు కూడా నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఎలా ఉంటుంది అంటే.. సూదుల్తో ఆ ప్రాంతంలో గుచ్చినట్లు ఉంటుంది. దీన్ని అనుభవించిన వారికే ఆ నొప్పి తెలుస్తుంది. ఇక ఈ నొప్పితోపాటు కిడ్నీ స్టోన్లు ఉన్నవారిలో పలు లక్షణాలు కూడా కనిపిస్తాయి. అవేమిటంటే.. వాంతికి వచ్చినట్లు ఉండడం, వికారంగా ఉండడం, చలి జ్వరం, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రం విసర్జించేటప్పుడు నొప్పిగా, మంటగా ఉంటుంది. కొందరికి మూత్రంలో రక్తం కూడా పడుతుంది.
కిడ్నీ స్టోన్లు ఉన్నవారు డాక్టర్లు ఇచ్చే మందులను వాడడంతోపాటు ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా క్యాల్షియం ఉండే ఆహారాలను తినకూడదు. పాలకూర, టమాటా, పాలు, పాల ఉత్పత్తులు, టీ, కాఫీలను తీసుకోకూడదు. నీళ్లను అధికంగా తాగాల్సి ఉంటుంది. బార్లీ గింజలను నీటిలో వేసి మరిగించి తాగుతున్నట్లయితే కిడ్నీ స్టోన్ల సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అలాగే మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపి ఉంచకూడదు. అలా చేస్తే స్టోన్స్ ప్రమాదం మరింత పెరుగుతుంది. క్యాల్షియం ఉండే ఆహారాలను తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. లేదా మానేయాలి. కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఈ సూచనలు పాటించకపోతే స్టోన్స్ మరింత పెద్దవయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే స్టోన్స్ ఒకసారి బయటకు పోతే మళ్లీ వచ్చేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. కనుక స్టోన్స్ వచ్చిన వారు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.