Kidney Disease Symptoms | మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు బయటకు పంపిస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. అయితే కొన్ని కారణాల వల్ల కిడ్నీల పనితీరు మందగిస్తుంది. దీంతో శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా కిడ్నీలు డ్యామేజ్ అవడానికి ముందే మన శరీరం పలు లక్షణాలు, సంకేతాలను తెలియజేస్తుంది. కిడ్నీ వ్యాధి వచ్చిన వారిలో ఈ లక్షణాలు చాలా ముందుగానే కనిపిస్తాయి. కిడ్నీ డ్యామేజ్, కిడ్నీ వ్యాధి రెండింటిలోనూ లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే దాంతో కిడ్నీలు మరింత డ్యామేజ్ అవకుండా కాపాడుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.
కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లవు. దీంతో విష పదార్థాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఈ కారణంగా మనకు నిద్ర పట్టదు. ఎవరైనా నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటుంటే ఎందుకైనా మంచిది కిడ్నీలను పరీక్ష చేయించుకోవాలి. సమస్య ఉంటే వైద్యున్ని కలసి చికిత్స తీసుకోవాలి. కిడ్నీలు బాగా పనిచేస్తే మన శరీరంలో విటమిన్ డి ని అవి ఎముకల కోసం వినియోగిస్తాయి. అలా పనిచేయకపోతే ఈపీవో అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీంతో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. వాటి ద్వారా రక్తం కూడా సరిగ్గా అందదు. ఈ క్రమంలో తలనొప్పి వస్తుంది. పనిచేసినా, చేయకపోయినా అలసటగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నా కిడ్నీ సమస్యగా అనుమానించాల్సిందే. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో వ్యర్ధ ద్రవాలు అలాగే ఉండిపోతాయి. అవి చర్మం కిందకు చేరి దురదను కలిగిస్తాయి. దీంతోపాటు చర్మం పొడిగా కూడా మారుతుంది.
కిడ్నీల పనితీరు మందగిస్తే నోరు దుర్వాసన వస్తుంది. నాలుక లోహపు రుచిలో ఉంటుంది. కిడ్నీలు బాగా పనిచేయకపోతే శ్వాస సరిగ్గా ఆడదు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. మడమలు, కాళ్లు, చేతుల్లో ద్రవాలు, నీరు బాగా పేరుకుపోయి అవి వాపులకు, నొప్పులకు లోనైతే కిడ్నీలు చెడిపోయాయని అర్థం చేసుకోవాలి. ఇలా లక్షణాలు ఉంటే డాక్టర్ను సంప్రదించాలి. కిడ్నీలు చెడిపోతే ఎప్పుడూ బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. కిడ్నీలు ఉన్న స్థానంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. వంగినా, కూర్చున్నా ఆ ప్రదేశంలో నొప్పిగా అనిపిస్తుంది. ఈ లక్షణాలు ఉన్నా కిడ్నీలు బాగా లేవని తెలుసుకోవాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మూత్రం ద్వారా ప్రోటీన్ పోతుంది. ఇలా జరిగితే కళ్లు వాపులకు లోనై, ఉబ్బి కనిపిస్తాయి. ఇలాంటి లక్షణం ఉంటే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిన్నదని తెలుసుకోవాలి.
కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే కనిపించే మరో లక్షణం హై బీపీ. హై బీపీ సమస్య ఉన్నా దాన్ని కిడ్నీ వ్యాధిగా అనుమానించి టెస్ట్ చేయించుకోవాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే వచ్చే మూత్రం దుర్వాసనతో ఉంటుంది. దీనికి తోడు మూత్రం ఎక్కువగా వస్తుంది. రోజుకు 4 నుంచి 10 సార్లు మూత్ర విసర్జన చేయడం సహజమే. ఇంతకన్నా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తుంటే దాన్ని కిడ్నీ వ్యాధిగా అనుమానించాలి. ఈ విధంగా ఎవరికైనా పలు లక్షణాలు, సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. సమస్య ఉంటే చికిత్స తీసుకోవాలి. దీంతో కిడ్నీలను రక్షించుకోవచ్చు.