ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులు అనే పదం చాలా మంది నోట సాధారణంగా వింటున్నాం. అదే ఓ పది పదిహేనేండ్ల కిందటైతే కేవలం 60 ఏండ్లు దాటినవారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ అభివృద్ధికి, పెరుగుతున్న పరిజ్ఞానానికి సమాంతరంగా మనుషుల్లో అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఈ క్రమంలో ఒకప్పుడు వయసు పైబడినవారిలో కనిపించే కీళ్ల నొప్పుల సమస్య (ఆర్థరైటిస్) ఇప్పుడు 20- 40 ఏండ్లవారిలోనూ చూస్తున్నాం. అయితే, నిజానికి ఆర్థరైటిస్‌కు వయసుతో సంబంధం లేదు. ఏ వయసువారి కైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దీర్ఘకాలిక వ్యాధిగా చెప్పవచ్చు. అలానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అంటూ లేదు. కానీ, సకాలంలో చికిత్స తీసుకుంటే వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చు.
ఒకప్పుడు ఆర్థరైటిస్‌కు చికిత్స అంతగా అందుబాటులో లేదు. అయితే, దశాబ్ద కాలం నుంచి ఆర్థరైటిస్ సమస్యలకు ప్రత్యేక చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఇక మనలో చాలామందికి కీళ్లనొప్పులను చాలా తేలిగ్గా తీసుకుంటారు. సమస్యపై అవగాహన లేక తీవ్ర అనారోగ్యాలకు గురవుతారు. అందుకని కీళ్లనొప్పుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది అక్టోబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్ ఆర్థరైటిస్ డే’ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేపథ్యంలో కీళ్లనొప్పులు ఎందుకు వస్తాయి, వాటి వల్ల కలిగే అనర్థాలేంటి, వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పద్ధతులు, అందుబాటులో ఉన్న చికిత్స విధానాలు తదితర అంశాలను గురించి తెలుసుకుందాం.
కీళ్లకు సంబంధించిన వ్యాధులను ఆర్థరైటిస్ డిసీజెస్ అంటారు. వీటిలో చాలా రకాలు ఉంటాయి. కానీ ప్రధానంగా మూడు రకాలు… సెప్టిక్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఎక్కువమందిలో కనిపిస్తుంటాయి. ఇక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు.
ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఆర్థరైటిస్‌ను సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు. కీళ్లలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు లేదా శరీరంలో వచ్చిన ఇన్ఫెక్షన్స్ కీళ్లకు వ్యాప్తి చెందినప్పుడు సెప్టిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలుంటాయి. దీనివల్ల తీవ్రమైన కీళ్లనొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వయసు రీత్యా వచ్చే కీళ్లనొప్పులను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ సమస్య కీళ్ల అరుగుదల వల్ల తలెత్తుతుంది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ఎముకలు, కీళ్లు అరుగుదలకు గురవుతాయి. ఈ విధంగా కీళ్లలో అరుగుదల ఏర్పడినప్పుడు మోకాళ్ల నొప్పులు, తుంటినొప్పి, నడుం నొప్పి వంటివి బాధిస్తాయి.
కీళ్లలో వాపు వల్ల వచ్చే నొప్పులను ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు. ఇది స్త్రీ, పురుషులు ఇద్దరిలో వచ్చినప్పటికీ పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం వెలుగు చూస్తున్న ఆర్థరైటిస్ సమస్యల్లో ఇది సర్వ సాధారణం. ప్రతి 100 మందిలో కనీసం ఒకరు ఈ వ్యాధికి గురవుతున్నారు.
ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల కీళ్ల వ్యాధులు వస్తాయి. అంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన కణాలు వ్యాధి కారకాలపై దాడిచేయడంతోపాటు మన శరీరంపై కూడా దాడి చేస్తాయి. ఎప్పుడైతే శరీరంలో ఆటో ఇమ్యూన్ కండిషన్ ఏర్పడుతుందో అప్పుడు వివిధ రకాల కీళ్ల వ్యాధులు తలెత్తుతాయి. ఇవి బయటి కారణాల వల్ల వచ్చిన వ్యాధులు కాదు. మన శరీరంలోనే పుట్టిన రుగ్మతలు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ప్రధానంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సర్వసాధారణంగా వస్తుంది. ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఇది కనిపిస్తుంది. ఇది కాకుండా లూపస్, స్ల్కీరోడెర్మా, మయోసైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధులే. వీటి కారణంగా కూడా కీళ్లనొప్పులు రావచ్చు. కీళ్లనొప్పులు ఉన్నవారిలో ఈ కండిషన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కీళ్లనొప్పులను నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని పట్టించుకోకపోతే సమస్య ప్రధాన అవయవాలపైనా ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా ఆర్థరైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే కొందరిలో చర్మవ్యాధులు, రక్తకణాలు తగ్గిపోవడం జరుగుతుంది. మరికొందరిలో కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. నరాల సమస్యలు కూడా తలెత్తవచ్చు. గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. పురుషుల్లో అయితే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సమస్య ఉత్పన్నమవుతుంది. హెచ్ఎల్ఏ బి-27 జీన్ వల్ల పురుషుల్లో దీని రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకని కీళ్లనొప్పులు బాధిస్తున్నప్పుడు ప్రత్యేక చికిత్స విధానాలు తెలిసిన రుమటాలజిస్టును సంప్రదించడం ఉత్తమం.
గర్భధారణ సమయంలో ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థరైటిస్ ఉన్న స్త్రీలు గర్భం దాల్చితే సమస్య పెరిగే అవకాశాలు ఉంటాయి. లేదా ప్రసవం తర్వాత కూడా ఆర్థరైటిస్ రావచ్చు. ఒకవేళ గర్భధారణకు ముందే వ్యాధి ఉంటే, వైద్యుల పర్యవేక్షణలో వ్యాధిని నియంత్రణలో ఉంచిన తర్వాత గర్భధారణకు వెళ్లడం ఉత్తమం. అంతేకాకుండా సురక్షిత ప్రసవం కోసం మందులు మార్పించుకోవాలి.
కుటుంబ నేపథ్యం ఉంటే ఆర్థరైటిస్‌కు 5 శాతం ముప్పు ఎక్కువగా ఉంటుంది. అంటే కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ఆర్థరైటిస్ సమస్య ఉండి ఉంటే వారికి ఈ సమస్యలు వచ్చే అవకాశాలు సాధారణ రోగుల కంటే ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల మందుల వల్ల కూడా గౌట్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆర్థరైటిస్‌ను నిర్ధారించడానికి ముందుగా రోగి లక్షణాలు, ఆరోగ్య చరిత్రను పరిశీలించిన తర్వాత రుమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటి సీసీపీ, యాంటి న్యూక్లియర్ యాంటిబాడీ (ఏఎన్ఏ) తదితర పరీక్షలు జరిపి వ్యాధిని నిర్ధారిస్తారు.
ఆర్థరైటిస్ వ్యాధులకు పూర్తిస్థాయి చికిత్స లేదు. ప్రారంభ దశలో గుర్తిస్తే వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చు. జీవనశైలి, ఆహార నియమాలు, రోజువారీ వ్యాయామం, ధూమపానం, మద్యపానం లాంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం, స్ట్రెస్ మేనేజ్మెంట్ తదితర నియమాలు పాటించాలి. ప్రస్తుతం బయలాజిక్స్ అనే ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. సకాలంలో సరైన పద్ధతిలో మందులు వాడాలి. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మందులు తీసుకోవాలి. రుమటాయిడ్ వ్యాధుల్లో ఎక్కువగా స్టిరాయిడ్స్, ఇమ్యునో సప్రెసెంట్స్ వాడుతారు. ఎక్కువగా మెథోట్రెక్సేట్, ఎజాథయోప్రిన్, సల్ఫాసాలజిన్, మైకోఫినోలేట్ తదితర ఇమ్యునో సప్రెసెంట్స్ వినియోగించడం జరుగుతుంది. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన రుమటాలజీ వైద్యులు పర్యవేక్షణలో సరైన పద్ధతిలో వినియోగిస్తే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.