గర్భిణుల్లో వేవిళ్లు రావడం, వికారంగా అనిపించడం సహజమే! అయితే, ఇవన్నీ మంచి సంకేతాలనే అంటున్నారు వైద్యరంగ నిపుణులు. అలాగే, వాంతుల వల్ల కడుపులో బిడ్డకు ఎలాంటి కష్టం, నష్టం ఉండదనీ చెబుతున్నారు. అంతేకాదు.. వాంతులు ఎక్కువగా వస్తే, అబార్షన్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందనీ అంటున్నారు. తాజా అధ్యయనాల్లో ఈ విషయాలు తెలిసినట్టు వెల్లడిస్తున్నారు. గర్భధారణ సమయంలో ఉత్పత్తి అయ్యే ‘హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్’ అనే హర్మోన్ ప్రభావం వల్లే.. వికారం, వాంతులు వస్తాయని చెబుతున్నారు. నిజానికి ఈ హార్మోన్.. గర్భాశయ పొరను మందంగా చేయడంలో సాయపడుతుంది. ఆ విధంగా, కడుపులో పెరిగే పిండానికి రక్షణనిస్తుంది. అయితే.. వికారం, వాంతులు అధికంగా ఉంటే మాత్రం గర్భిణులు ఇబ్బంది పడాల్సి వస్తుందనీ, అలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.