మా బాబుకు పద్నాలుగు ఏండ్లు. ఆరు నెలల నుంచి తరచుగా విరేచనాలు అవుతున్నాయి. విరేచనం కొద్దికొద్దిగా అయ్యింది. కొన్నిసార్లు రక్తం కూడా పడింది. డాక్టర్ దగ్గరకు వెళ్తే మందులు ఇచ్చారు. వాటిని వాడినప్పుడు తగ్గడం.. కొన్నాళ్లకు మళ్లీ విరేచనాలు అవ్వడం సాధారణమై పోయింది. ఈ ఆరు నెలల్లో బరువు తగ్గాడు. ఎప్పుడూ నీరసంగా ఉంటున్నాడు. పరిష్కారం ఏంటి?
పిల్లలకు అప్పుడప్పుడూ విరేచనాలు కావడం సాధారణమే. వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల అలా జరుగుతుంది. అప్పుడప్పుడూ నీళ్ల విరేచనాలు కూడా అవుతాయి. కొన్నిసార్లు వాంతులతో మొదలవుతాయి. కొన్నిరోజులకు తగ్గుతాయి. తగ్గకపోతే లక్షణాన్ని బటి వైద్యం చేయించాల్సి ఉంటుంది. ఓఆర్ఎస్ నీళ్లు తాగడం, ప్రో బ్యాక్టీరియా పదార్థాలు తినడం వల్ల సాధారణ విరేచనాలు తగ్గుతాయి. కానీ ఆరు నెలల నుంచి పదే పదే విరేచనాలు అవ్వడం, రక్తం పడటం, బరువు తగ్గడం, నీరసంగా ఉండటం మంచి లక్షణాలు కావు. దీనికి ఏదైనా బలమైన కారణం ఉందేమో తెలుసుకోవాలి.
ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్ అనే పేగు సంబంధమైన సమస్యలు ఉంటే ఇలాగే అవుతుంది. దానిని క్రాన్స్ డిసీజ్ అంటారు. ఇది పిల్లలకే కాదు పెద్దలకూ వస్తుంది. పేగుల్లో రియాక్షన్ వల్ల ఇన్ఫ్లమేషన్ కలుగుతుంది. ఆహారం జీర్ణం కాకపోవడం, రక్తం పోవడం వల్ల రక్తహీనత బారినపడతారు. అందువల్ల నీరసంగా ఉంటారు. మీ ఇంట్లో ఇలాంటి లక్షణాలతో ఎవరైనా ఉన్నారా? అన్నది రాయలేదు. బహుశా లేకపోవచ్చేమో! పిల్లల వైద్యులను.. అలాగే గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ని సంప్రదించి తీవ్రమైన, దీర్ఘకాల వ్యాధి కాదని నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఇది ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్ అయితే దానికి చికిత్స ఉంది. ప్రత్యేకమైన మందులు వాడుతూ, కొన్ని ఆహార నియమాలు పాటిస్తే తగ్గుతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పీడియాట్రీషియన్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ని కలవండి.
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్