e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home Top Slides ఈ మందులు కరోనాను తగ్గిస్తాయా?!

ఈ మందులు కరోనాను తగ్గిస్తాయా?!

ఈ మందులు కరోనాను తగ్గిస్తాయా?!
  • డెక్సా, టోస్లీ జొమాబ్‌, రెమ్‌డెసివిర్‌ పనిచేస్తాయా?
  • ప్లాస్మాథెరపీ పనితీరు సామర్థ్యం ఎంత?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్సలో వినియోగిస్తున్న చాలా మందులు వ్యాధిని తగ్గిస్తాయని ఎక్కడా నిరూపణ కాలేదు. అలాంటి వాటిలో రెమ్‌డెసివిర్‌, ప్లాస్మా, డాక్సీ సైక్లిన్‌, ఫావిఫిరావిర్‌, టోసిలి జుమాబ్‌ తదితర మందులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రజల్లో మాత్రం వీటికి విపరీతంగా డిమాండ్‌ ఉన్నది. వైద్యులు ఎక్కువగా వీటిని సూచిస్తుండటం ఆలోచన రేకెతిస్తున్నది. పలు అధ్యయనాల ప్రకారం, దేని సామర్థ్యం ఎంత, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంత అనేది తెలుసుకుందాం..

రెమ్‌డెసివిర్‌

ఇది వైరస్‌ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఏదేని వైరస్‌ సోకి రోగి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఈ ఔషధాన్ని ఇస్తారు. ఇది ఆక్సిజన్‌ స్థాయిలను మెరుగుపరుస్తుంది. వ్యాధి ముదరకుండా అడ్డుకుంటుంది. ఆక్సిజన్‌ స్థాయి గణనీయంగా పడిపోయినప్పుడు, రోగికి న్యుమోనియా ఉండి వెంటిలేటర్‌పై ఉంచినప్పుడు రెమ్‌డెసివిర్‌ పనిచేయదని కంపెనీ చెప్తున్నది. వెంటిలేటర్‌పై ఉన్న సాధారణ రోగులను బతికించే అవకాశాలు కూడా తక్కువేనని వివిధ అధ్యయనాలు చెప్తున్నాయి. రెమ్‌డెసివిర్‌ వల్ల కాలేయం, కిడ్నీ పనితీరుపై ప్రభావం కనిపిస్తుంది.

విటమిన్‌ సీ, డీ, జింక్‌

ఇవి సూక్ష్మ పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి శరీర విధులను ప్రభావితం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. విటమిన్స్‌, ఇతర సప్లిమెంట్స్‌ కొవిడ్‌ లేదా ఇతర ఏ రోగం తగ్గడంలోనూ ప్రభావం చూపవు. ఆ విటమిన్లు లోటు ఉన్న వారికి ఇవి ఉపయోగపడతాయి. శ్వాస సంబంధ సమస్యలు తగ్గించడంలో కొంతవరకు ఉపయోగపడతాయి. ఇవి దీర్ఘకాలం శరీరంలో పనిచేస్తాయి. విటమిన్‌ డీ కొంతవరకు సీవియర్‌ డిసీజ్‌లను తగ్గించడంలో ఉపయోగపడుతుందని, దీనిపై పూర్తిస్థాయి అధ్యయనాలు లేవని స్పష్టమైంది.

డెక్సా మిథాసోన్‌

ఇదొక కోర్టికో స్టెరాయిడ్‌ డ్రగ్‌. రోగనిరోధక ప్రతి చర్యను తగ్గించడానికి వినియోగిస్తారు. కోవిడ్‌ రోగులకు చికిత్స చేయడానికి, లక్షణాలు తగ్గించడానికి ఆమోదం పొందిన మందుల్లో ఇదొకటి. ఇది శరీరం, ఊపిరితిత్తుల్లో మంట, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోగికి ఆక్సిజన్‌ అవసరమైనపుడు స్టెరాయిడ్లు ఉపయోగపడతాయి. వైద్యుల పర్యవేక్షణలో ఇది జరగాలి. శ్వాస సంబంధ సమస్యలు, న్యుమోనియాతో బాధపడుతున్న వారికి నోటి ద్వారా తీసుకునే డెక్సా మిథాసోన్‌ను వినియోగిస్తున్నారు. మోడరేట్‌ దశలో, సాచురేషన్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నప్పుడు వాడతారు. దీంతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకపోలేదు. రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ని ఇది పెంచుతుంది.

టోసిలి జుమాబ్‌

‘ఇంటర్‌లూకిన్‌-6’ (ఐఎల్‌-6)ను నిరోధించే ఔషధాల్లో టోసిలి జుమాబ్‌ ఒకటి. ఇంటర్‌లూకిన్లు మన రోగనిరోధక శక్తిలో భాగమైన ప్రొటీన్లు. ఇవి కణాల మధ్య సిగ్నలింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఇచ్చే సమాచారాన్ని బట్టి రోగనిరోధక శక్తి స్పందిస్తుంది. ఈ ‘ఐఎల్‌-6’ ప్రొటీన్లను అడ్డుకోవడం ద్వారా వ్యాధి తీవ్రత పెరుగకుండా టోసిలి జుమాబ్‌ అడ్డుకుంటుంది. రోగి తీవ్ర అస్వస్థతతో ఉండి, ఆక్సిజన్‌ స్థాయి వేగంగా పెరుగాల్సిన సమయంలో ఈ మందును ఇంజక్షన్‌ రూపంలో లేదా స్లైన్‌లో కలిపి ఇస్తారు. ఇది వెంటిలేటర్‌పై ఉన్నవారిని కాపాడి మరణాల శాతాన్ని అడ్డుకుంటుంది. ఆక్సిజన్‌ బెడ్‌పై ఉన్నవారికి ఇస్తే వెంటిలేటర్‌ దాకా వెళ్లకుండా అడ్డుకోగలుగుతుంది. రూమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ చికిత్సలోనూ ఇది సహాయపడుతుంది. టోసిలి జుమాబ్‌ వల్ల జలుబు, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం, కడుపునొప్పి వంటి దుష్ప్రభావాలు ఉంటాయి.

ప్లాస్మా థెరపీ

కరోనా నుంచి కోలుకున్నవారి శరీరంలో ప్రతి రక్షకాలు ఏర్పడుతాయని తెలిసిందే. ఇవి రక్తంలోని ప్లాస్మాలో నిల్వ ఉంటాయి. ఈ ప్లాస్మాను సేకరించి తీవ్ర కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారికి ఎక్కిస్తారు. దీంతో ప్లాస్మాలో ఉండే ప్రతిరక్షకాలు వైరస్‌తో పోరాడి వ్యాధిని తగ్గిస్తాయి. భారత్‌ సహా అనేక దేశాల్లో ఇది అమల్లో ఉన్నది. ఉత్తమ ఫలితాలు అందిస్తున్నది. కానీ వెంటిలేటర్‌పై ఉన్నవారికి పెద్దగా ప్రభావం చూపడం లేదని వివిధ అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ చికిత్సతో పెద్దగా దుష్ప్రభావాలు లేవు. కొందరిలో ఎలర్జీలు రావొచ్చు.

ఫావిపిరవిర్‌

ఇది యాంటీ వైరల్‌ డ్రగ్‌. ఇది రెమ్‌డెసివిర్‌ మాదిరిగానే వైరస్‌ ప్రభావాన్ని తగ్గిస్తుందని కంపెనీ చెప్తున్నది. కానీ ఇందుకు ఆధారాలు లేవు. ఇది పెద్దగా పనిచేయడం లేదని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. గర్భిణులు ఈ ఔషధాన్ని తీసుకుంటే పిండానికి ప్రమాదం. అయితే ఇది జంతువుల్లో జికా, నిఫా వంటి వైరస్‌లను సమర్థంగా ఎదుర్కొన్నట్టు తేలింది.

డాక్సీ సైక్లిన్‌, అజిత్రో మైసిన్‌, అమాగ్జిలిన్‌

ఇవి యాంటీ బయాటిక్స్‌. బ్యాక్టీరియా పరివర్తన చెందకుండా ఇవి అడ్డుకుంటాయి. యాంటీ బయాటిక్స్‌ వైరస్‌లను ఏమీ చేయలేవు. అయినప్పటికీ కొందరు వైద్యులు కోవిడ్‌ బారిన పడ్డ వారికి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లను తగ్గించేందుకు ఈ మందులను సూచిస్తున్నారు. అయితే ఇష్టారీతిగా వీటిని వినియోగించడం వల్ల యాంటీ బయాటిక్‌ రెసిస్టెన్సీ పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. దీని వినియోగం వల్ల కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈ మందులు కరోనాను తగ్గిస్తాయా?!

ట్రెండింగ్‌

Advertisement