Palm Oil | మనం వంట చేసేందుకు అనేక రకాల ఆయిల్స్‌ను ఉపయోగిస్తుంటాం. మన ఇంట్లో చేసే వంటలకు నాణ్యమైన వంట నూనె ఏదో తెలుసుకుని మరీ ఉపయోగిస్తుంటాం. అయితే బయట హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఇతర ప్రదేశాల్లో కొందరు పామాయిల్‌ను ఉపయోగిస్తుంటారు. తక్కువ ధరకు వస్తుందని చెప్పి కొందరు ఇళ్లలోనూ వంటలకు పామాయిల్‌ను వాడుతుంటారు. అయితే పామాయిల్‌ను వాడడం మంచిదేనా..? దీని వల్ల మన ఆరోగ్యానికి ఏదైనా హాని కలుగుతుందా..? పామాయిల్ వల్ల కలిగే లాభాలు ఏమిటి..? నష్టాలు ఏమిటి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పామాయిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పామాయిల్లో అధికంగా ఉండే కెరోటినాయిడ్స్ మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతాయి. విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. తరచూ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడుతున్నవారు పామాయిల్‌ను వాడవచ్చు. విటమిన్ ఎ లోపం ఉన్నవారు కూడా ఈ నూనెను ఉపయోగించవచ్చు. మెదడు ఆరోగ్యానికి కూడా పామాయిల్ మేలు చేస్తుంది. పామాయిల్లో న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి అల్జీమర్స్ రాకుండా చూస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు రాకుండా అడ్డుకోవచ్చు. పామాయిల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం పామాయిల్‌ను వాడుతుంటే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. అయితే ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ పామాయిల్‌ను వాడడం వల్ల పలు నష్టాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే..
పామాయిల్లో 50 శాతం మేర శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ఇవి మన శరీరంలో ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకనే బయట పామాయిల్‌తో చేసిన ఫుడ్‌ను తినొద్దని వైద్యులు చెబుతుంటారు. ఇది ఎప్పటికైనా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అలాగే పామాయిల్‌ను వినియోగదారులకు విక్రయించేందుకుగాను అనేక దశల్లో రీఫైన్ చేస్తారు. దీంతో ఆ ఆయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్‌ను కోల్పోతాము. అలాంటి ఆయిల్‌ను వాడినా ప్రయోజనం ఉండదు. పైగా నష్టమే కలుగుతుంది. కనుక సహజసిద్ధంగా తయారు చేయబడిన పామాయిల్‌ను వాడాలని సూచిస్తున్నారు.
అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు పామాయిల్‌ను ఏమాత్రం వాడకూడదని లేదంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పామాయిల్లో పామిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో వాపులకు కారణం అవుతుంది. ఇది మన శరీరంలో అధికంగా చేరితే గుండె జబ్బులను కలగజేస్తుంది. అలాగే పామాయిల్‌ను అధికంగా ఉపయోగించడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే గుండె జబ్బులు వచ్చేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. కానీ అధిక మొత్తంలో ఈ నూనెను వాడితే ఇదే గుండె జబ్బు వచ్చేందుకు ప్రధాన కారణం అవుతుందని అంటున్నారు. కనుక పామాయిల్‌ను వాడుతున్నవారు లేదా బయటి ఫుడ్‌ను తింటున్నవారు ఒకసారి మళ్లీ ఆలోచించుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.