Insomnia | భారతదేశం ప్రస్తుతం నిశ్శబ్ద నిద్ర మహమ్మారిగా పేర్కొంటున్న ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం, దేశంలోని సుమారు 46 శాతం మంది పెద్దలు దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పనిచేసే యువతలో ఇది మరింత తీవ్రంగా కనిపిస్తోంది. చాలా మంది రోజుకు కేవలం ఆరు గంటలపాటు మాత్రమే నిద్రపోతున్నట్లు నివేదిక వెల్లడించింది. సర్వే ప్లాట్‌ఫాం నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం అధికంగా స్క్రీన్ వినియోగం, అసమయపాలిత జీవనశైలి, మానసిక ఒత్తిడి కారణంగా యువతలో నిద్ర సమస్యలు పెరుగుతున్నాయి. నిద్ర మధ్యలో అంతరాయం కలిగే వారిలో 72 శాతం మంది రాత్రి సమయంలో మెళకువ వచ్చి వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు శబ్ద కాలుష్యం, దోమల సమస్య, అనియమిత జీవనశైలి కూడా ప్రధాన కారణాలుగా గుర్తించారు.
ఇక నిద్రలేమి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలికంగా సరిపడా నిద్ర లేకపోవడం వల్ల ఆందోళన, డిప్రెషన్, రక్తపోటు, మెటబాలిక్ సమస్యలు, గుండె జబ్బులు, చదువులో ప్రతిభ తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా చర్మ సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితిని నిశ్శబ్ద నిద్ర మహమ్మారిగా పేర్కొంటూ, దీర్ఘకాలిక నిద్రలేమి మెదడు పనితీరును వేగంగా దెబ్బతీస్తుందని, డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతుందని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన మెటా-విశ్లేషణల ప్రకారం, నిరంతర ఇన్సోమ్నియా అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని పేర్కొంది. లోతైన నిద్రలో మెదడులో పేరుకుపోయే హానికర ప్రోటీన్లు సరిగా తొలగించబడకపోవడమే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.
ఆరోగ్యపరమైన ప్రభావాలతో పాటు, నిద్రలేమి ఆర్థిక రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. RAND కార్పొరేషన్ అధ్యయనం ప్రకారం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిపి ప్రతి సంవత్సరం సుమారు 680 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఉత్పాదకత తగ్గడం, ఉద్యోగ ప్రదేశాల్లో ప్రమాదాలు పెరగడం, వైద్య ఖర్చులు అధికమవడం, అకాల మరణాలు వంటి కారణాల వల్ల ఈ నష్టం జరుగుతోంది. డిజిటల్ వినియోగం పెరగడం, కోవిడ్ అనంతర ఒత్తిడి నేపథ్యంలో ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, జీవనశైలిలో చిన్న మార్పులు తీసుకురావడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపర్చుకోవచ్చని నివేదిక సూచిస్తోంది. బాగా నిద్రపోతున్న భారతీయుల్లో 60 శాతం మంది తేలికపాటి భోజనం, రోజువారీ వ్యాయామం, ప్రశాంత గృహ వాతావరణం మంచి నిద్రకు దోహదపడుతున్నాయని తెలిపారు. ఈ నివేదికను దేశవ్యాప్తంగా మూడు నెలలపాటు 393 జిల్లాల్లో 89 వేల మందితో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించారు.
నియమిత నిద్ర, మేల్కొనే సమయాలను పాటించడం ద్వారా శరీరంలోని సర్కేడియన్ రిథమ్ సక్రమంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు ముందు మృదువైన సంగీతం వినడం వల్ల త్వరగా నిద్ర పట్టడమే కాకుండా నిద్ర నాణ్యత కూడా మెరుగవుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, ఆసుపత్రిలో ఉన్న రోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఉదయం సూర్యకాంతి శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ నియంత్రణకు సహాయపడుతుంది. సహజ ఆహార పదార్థాలు అధికంగా ఉండే, అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారం తక్కువగా ఉండే ఆహార విధానం పాటించడం కూడా మంచి నిద్రకు దోహదపడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.