Immunity Power | వర్షాకాలంలో సాధారణంగా చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుంటారు. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలతోపాటు దోమలు కుట్టడం వల్ల విష జ్వరాలు కూడా వస్తుంటాయి. అయితే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఈ వ్యాధుల బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చు. పెద్దలు లేదా చిన్నారులు ఎవరైనా సరే రోగ నిరోధక శక్తిని అధికంగా కలిగి ఉండాలి. దీని వల్ల ఎలాంటి రోగాలను అయినా ఎదుర్కోనే శక్తి శరీరానికి లభిస్తుంది. అయితే చాలా మందికి ప్రస్తుతం ఇమ్యూనిటీ పవర్ ఉండడం లేదు. ఇందుకు గాను ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజసిద్ధంగా మన ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవచ్చు. పలు ఆహారాలను ఈ సీజన్లో రోజూ తింటే చాలు, దాంతో రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు, జ్వరాలకు చెక్ పెట్టవచ్చు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. దీని వల్ల తెల్ల రక్త కణాలు వృద్ధి చెందుతాయి. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాలను త్వరగా తగ్గేలా చేస్తుంది. సిట్రస్ జాతికి చెందిన నారింజ, నిమ్మ, గ్రేప్ ఫ్రూట్ వంటి పండ్లను తినడం వల్ల విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. అలాగే ఉసిరికాయ జ్యూస్, కివి పండ్లు, క్యాప్సికం, బ్రోకలీ, బొప్పాయి వంటి వాటిని కూడా తీసుకోవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగుతున్నా కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన ఇంట్లో ఉండే అనేక మసాలా దినుసులు మన శరీర ఇమ్యూనిటీ పవర్‌ను పెంచేందుకు సహాయం చేస్తాయి. ఈ మసాలా దినుసుల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మసాలా దినుసులను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. దీన్ని మీరు రోజూ తాగే టీ లేదా సూప్స్‌లో వేసి తీసుకోవచ్చు. లేదా అల్లం రసం తాగవచ్చు. చిన్న అల్లం ముక్కను నేరుగా నమిలి తినవచ్చు. పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. పసుపును పాలలో కలిపి తాగుతుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఉల్లి, వెల్లుల్లి కూడా రోగ నిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని పచ్చిగా తింటే ఎంతో మేలు జరుగుతుంది. వెల్లుల్లి రెబ్బలను ఉదయం పరగడుపునే తినవచ్చు. రోజులో ఇతర సమయాల్లో పచ్చి ఉల్లిపాయలను తినవచ్చు. ఇవి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో వర్షాకాలంలో రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చు. అలాగే మిరియాలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే పైపరైన్ అనే సమ్మేళనం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
యాలకులు, లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. వీటిని కూడా మీరు రోజూ తాగే టీ లేదా కాఫీలో వేసి తాగవచ్చు. లేదా నేరుగా కూడా తినవచ్చు. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను అమాంతం పెంచి రోగాల నుంచి రక్షిస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే చాలా వరకు రోగాలు రాకుండా చూసుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే అందులో ఉండే మంచి బ్యాక్టీరియా ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండాలి. ఇందుకు గాను ప్రో బయోటిక్ ఆహారాలు పనిచేస్తాయి. ఇవి మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దీంతో రోగాలకు చెక్ పెట్టవచ్చు. పెరుగు, మజ్జిగ వంటి ఆహారాలు ప్రో బయోటిక్ ఆహారాలుగా పేరుగాంచాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. అలాగే క్యారెట్లు, చిలగడదుంపలు, బీట్రూట్ వంటి ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. వీటిని రోజూ తింటున్నా కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.