Immunity Power | చలికాలంలో సహజంగానే మనల్ని శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీరు చాలా చల్లగా ఉంటుంది. దీనికి తోడు వాతావరణం కూడా ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. కనుక ఈ సీజన్లో మనం ఇలాంటి రోగాల నుంచి సురక్షితంగా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను డైట్లో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక చలికాలంలో మన ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రోకలీలో విటమిన్ సి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బ్రోకలీని పెనంపై కాస్త వేయించి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రోగాలను రానివ్వదు. కనుక చలికాలంలో బ్రోకలీని తీసుకోవడం మరిచిపోకండి. అలాగే ఈ సీజన్లో బాదంపప్పును కూడా తినవచ్చు. ఈ పప్పులో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతాయి. రోజూ గుప్పెడు బాదంపప్పును నీటిలో నానబెట్టి తింటుంటే ప్రయోజనం ఉంటుంది. వీటిని చలికాలంలో సాయంత్రం సమయంలో చక్కని స్నాక్స్‌లా కూడా తినవచ్చు.
పాలకూరలో అనేక విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు ఎ, సి, ఇ ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. పాలకూరను సూప్‌లలో వేసి తినవచ్చు. లేదా కాస్త వేయించి తినవచ్చు. దీంతో పాలకూరలో ఉండే పోషకాలను మనం పొందవచ్చు. ఈ సీజన్లో మనకు చిలగడదుంపలు కూడా సమృద్ధిగానే లభిస్తాయి. కనుక వీటిని తిని కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఈ దుంపల్లో బీటాకెరోటిన్ ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. చిలగడ దుంపలను నేరుగా తినవచ్చు. జీర్ణం కావు అనుకుంటే కాస్త నెయ్యి వేసి ఉడికించి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి.
పసుపును మనం రోజూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. అయితే దీన్ని పాలలో కలుపుకుని తాగితే మేలు జరుగుతుంది. పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పాలలో పసుపు కలుపుకుని తాగితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే శరీరంలోని వాపులు, నొప్పులు సైతం తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. అదేవిధంగా వెల్లుల్లిలో ఉండే ఆల్లిసిన్ అనే సమ్మేళనం రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్ల నుంచి రక్షణను అందిస్తుంది. కనుక వెల్లుల్లిని కూడా ఈ సీజన్లో అధికంగానే తీసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.