Beetroot | మన శరీరానికి సూపర్ ఫుడ్ గా పరిగణించబడే వాటిల్లో బీట్రూట్ కూడా ఒకటి. బీట్రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో నైట్రేట్లు, బీటాలైన్లు, ఫోలేట్, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనిని అనేక రూపాల్లో మనం ఆహారంగా తీసుకుంటాం. దీనిని నేరుగా సలాడ్ రూపంలో తీసుకోవడంతో పాటు జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటాం. బీట్రూట్ షాట్స్ కూడా 2025 లో అత్యంత ప్రజాదరణ పొందిన ట్రెండ్ లలో ఒకటి అని చెప్పవచ్చు. అలాగే బీట్రూట్ ను ఉడికించి తీసుకుంటూ ఉంటారు. అయితే బీట్రూట్ ను పచ్చిగా తీసుకోవడం మంచిదా.. ఉడికించి తీసుకోవడం మంచిదా.. అనే దానిపై అనేక వాదనలు వినిపిస్తూ ఉంటాయి.
బీట్రూట్ ను నేరుగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంది అనే వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. అయితే బీట్రూట్ ను తీసుకోవడానికి సరైన మార్గం ఏమిటి.. శాస్త్రీయ అధ్యయనాలు, పరిశోధనలు దీని గురించి ఏం చెబుతున్నాయో.. ఇప్పుడు తెలుసుకుందాం. 100 గ్రాముల ముడి బీట్రూట్ లో 43 క్యాలరీలు, 9.6గ్రా. పిండి పదార్థాలు, 2.8 గ్రా. ఫైబర్, 6.8 గ్రా. చక్కెరలు, 1.6గ్రా. ప్రోటీన్, పొటాషియం 325 మి.గ్రా., ఐరన్ 0.8 మి.గ్రా., బలమైన బీటాలైన్ లు ఉంటాయి. ఉడికించిన బీట్రూట్ లో 44 క్యాలరీలు, 10గ్రా. పిండి పదార్థాలు, 2 గ్రా. ఫైబర్, 7 గ్రా. చక్కెరలు ఉంటాయి. వీటిని ఉడికించడం వల్ల విటమిన్ సి తో పాటు బీటాలైన్ లు కూడా తగ్గుతాయి. సాధారణంగా బీట్రూట్ ను పచ్చిగానే తీసుకుంటూ ఉంటారు. పచ్చిగా తీసుకోవడం వల్లనే పోషకాలు మన శరీరానికి ఎక్కువగా అందుతాయి.
దుంపలను పచ్చిగా తీసుకోవడం వల్ల వాటిలో ఉండే నైట్రేట్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిపై జరిపిన అధ్యయనాల ప్రకారం ప్రతిరోజూ 8 వారాల పాటు పచ్చిదుంపలను తీసుకోవడం వల్ల హెచ్ఎ1సి, రక్తపోటు వంటి సమస్యలు తగ్గాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. పచ్చి దుంపలను తీసుకోవడం వల్ల దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు కలిగేలా చేస్తుంది. అలాగే కడుపు నిండిన భావన కలుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారు బీట్రూట్ ను నేరుగా తీసుకోవడం అంత మంచిది కాదు. ఉడికించిన బీట్రూట్ లో ఫైబర్ మృదువుగా తయారవుతుంది. దీంతో ఇది సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సరిగ్గా లేని వారు, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు ఉడికించిన బీట్రూట్ ను తీసుకోవడం మంచిది.
అలాగే ఉడికించిన బీట్రూట్ లో ఆక్సలైట్స్ తక్కువగా ఉంటాయి. కనుక మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఉడికించిన బీట్రూట్ ను తీసుకోవచ్చు. ఉడికించిన బీట్రూట్ ను తీసుకోవడం వల్ల దానిలో ఉండే పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి. బీట్రూట్ ను ఉడికించి చేయడం వల్ల సూప్ లు, సలాడ్ లు మరింత రుచిగా మారుతాయి. పచ్చి బీట్రూట్, ఉడికించిన బీట్రూట్ రెండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సలాడ్, స్మూతీ వంటి వాటిల్లో పచ్చి బీట్రూట్ ను తురిమి వేసుకోవాలి. రైతా, వేయించిన సలాడ్ వంటి వాటిలో ఉడికించిన బీట్రూట్ ను వేసుకోవాలి. బీట్రూట్ ను ఉడికించినప్పటికీ 20 లేదా 30 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. ఇలా చేయడం వల్ల పోషకాలు పోకుండా ఉంటాయి.