లండన్ : గుండె జబ్బులతో కుదేలవుతున్న ప్రపంచానికి ఊరటగా బ్రిటిష్ పరిశోధకులు అద్భుత జెల్‌ను కనుగొన్నారు. గుండె పోటు తర్వాత కలిగే డ్యామేజ్‌ను పూడ్చేందుకు ఉపకరించే న్యూ జెల్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ కార్డియోవాస్క్యులర్ చికిత్సల్లో మేలి మలుపుగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు.
గుండె వైఫల్యం ముప్పును తగ్గించేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో మార్గాలను అన్వేషిస్తున్నారు. గుండెలోకి నేరుగా పంపించే కణాల్లో ఒక శాతం మాత్రమే మనగలుగుతున్నాయి. తాజా పరిశోధనలో కనుగొన్న న్యూ జెల్ ద్వారా గుండెలో నూతన కణజాలం పెరిగేలా చేయవచ్చని వెల్లడైంది. పెప్టైడ్స్గా పిలిచే ఎమినో యాసిడ్స్ చైన్స్ నుంచి ఈ జెల్‌ను రూపొందించారు. లిక్విడ్ రూపంలో ఉండే జెల్‌ను సులభంగా గుండెలోకి పంపించవచ్చు.
మాంచెస్టర్‌లో జరిగిన బ్రిటిష్ కార్డియోవాస్క్యులర్ సొసైటీ సదస్సులో ఈ అధ్యయన వివరాలను సమర్పించారు. భవిష్యత్‌లో దెబ్బతిన్న గుండెల పునరుజ్జీవ చికిత్సల్లో తమ జెల్ కీలక పాత్ర పోషిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన పరిశోధకుల బృందం విశ్వాసం వ్యక్తం చేసింది. హార్ట్ ఎటాక్ తర్వాత దెబ్బతిన్న గుండెల మరమ్మత్తులో ఈ నూతన టెక్నాలజీ అత్యంత సామర్ధ్యంతో పనిచేసి కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన పీహెచ్డీ విద్యార్ధి కేథరిన్ కింగ్ చెప్పారు.