Cancer Treatment | తల, మెడ భాగాల్లో వచ్చే క్యాన్సర్లను ‘హెడ్ అండ్ నెక్ క్యాన్సర్’ అని పిలుస్తారు. ఇందులో నోరు, గొంతు, స్వరపేటిక, లాలాజల గ్రంథులు మొదలైనవి తీవ్రంగా ప్రభావితం అవుతాయి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ చికిత్సకు సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ లాంటివి ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. తాజాగా ఇమ్యునోథెరపీ మీద ఆసక్తి పెరుగుతున్నది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించే చికిత్సే.. ఇమ్యునోథెరపీ. ఈ థెరపీలో ఇచ్చే ఔషధాలు.. కణాల రోగ నిరోధక శక్తిపై దాడిచేసి, వాటిని క్షీణింపజేసే క్యాన్సర్ కణాల మీద ఉండే ప్రత్యేకమైన ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుంటాయి.
మన రోగ నిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తుపెట్టుకుని మరీ, వాటిమీద మరింత సమర్థంగా దాడి చేయడంలో సాయపడతాయి. తల, మెడ క్యాన్సర్ చికిత్సలో.. ప్రత్యేకించి, ఒక దగ్గర మొదలై ఇతర భాగాలకు పాకే మెటాస్టాటిక్ క్యాన్సర్ విషయంలో ఇమ్యునోథెరపీ విజయవంతంగా పని చేస్తున్నట్టు రుజువైంది. క్లినికల్ ట్రయల్స్‌లో కూడా.. మిగిలినవారితో పోలిస్తే.. ఇమ్యునోథెరపీ తీసుకున్న రోగులే వేగంగా కోలుకున్నట్టు వెల్లడైంది. పైగా, సంప్రదాయ క్యాన్సర్ చికిత్సలతో పోలిస్తే ఇమ్యునోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. మొత్తానికి, తల మెడ క్యాన్సర్ రోగులకు ఇమ్యునో థెరపీ అతి ముఖ్యమైన చికిత్సగా అవతరించింది. మున్ముందు ఆ మహమ్మారి నియంత్రణలో కీలకపాత్ర పోషించనుంది.