Kidneys Health | మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి రక్తం నుండి వ్యర్థాలను, అదనపు నీటిని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. శుభ్రపడిన రక్తాన్ని తిరిగి శరీరానికి పంపిస్తాయి. రక్తాన్ని శుభ్రం చేయడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచడంలో, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడంలో, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో కూడా మూత్రపిండాలు మనకు సహాయపడతాయి. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటే శరీర మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. శారీరక విధులకు అంతరాయం కలుగుతుంది. ఇది క్రమంగా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కనుక మూత్రపిండాల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండడం చాలా మంచిది.
మూత్రపిండాల పనితీరు తగ్గినప్పుడు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ముందుగా కనిపించే లక్షణాలను గమనించడం చాలా అవసరం. ఈ లక్షణాలను గుర్తించడం వల్ల మూత్రపిండాల సమస్యలు మరింత తీవ్రతరం కాకుండా మనం కాపాడుకోవచ్చు. మూత్రపిండాల సమస్యలను తెలియజేసే ముందస్తు హెచ్చరికల గురించి.. అలాగే మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.. వైద్యులు వివరిస్తున్నారు. మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేనప్పుడు తరచుగా మూత్ర విసర్జన చేయడం లేదా మూత్రం బయటకు తక్కువగా రావడం జరుగుతుంది. అలాగే మూత్రం రంగులో కూడా మార్పులు వస్తాయి. మూత్రపిండాల పనితీరు తగ్గినప్పుడు శరీరంలో ద్రవం ఎక్కువగా ఉంటుంది. దీంతో కాళ్లల్లో వాపు వస్తుంది.
అలాగే మూత్రపిండాల పనితీరు తగ్గడం వల్ల శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతాయి. కనుక శరీరం బలహీనంగా అవ్వడం, తరచూ అలసటగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ద్రవాలు ఎక్కువగా పేరుకుపోతాయి. కనుక ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. వ్యర్థాలను తొలగించడం మూత్రపిండాల ప్రాథమిక విధి. వీటి పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల జీర్ణాశయంలో వ్యర్థాలు పేరుకుపోయి జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. తద్వారా వికారం, వాంతులు వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అలాగే మూత్రపిండాల పనితీరు మందగించడం వల్ల రక్తపోటు పెరగడం వంటివికూడా జరుగుతాయి. కనుక ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
ఇక మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నీటిని ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరం నుండి వ్యర్థాలు బయటకు పోతాయి. అలాగే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా శరీరానికి తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. తద్వారా రక్తపోటు, శరీర బరువు, షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ధూమపానం, మద్యపానం రెండూ కూడా మూత్రపిండాల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కనుక ఈ రెండింటికీ దూరంగా ఉండడం చాలా మంచిది. మూత్రపిండాల ఆరోగ్యంపై శరీర మొత్తం ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కనుక మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు.