Digestive System | మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి శక్తిని, పోషకాలను అందించేందుకు జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థలో అనేక అవయవాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణాశయం, పేగులు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ప్రస్తుతం చాలా మంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న వయస్సులోనే గ్యాస్ బారిన పడుతున్నారు. దీంతోపాటు మలబద్దకం కూడా చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే జీర్ణ సమస్యలు మనకు సహజంగానే అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ ఇవి దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలోనే జీర్ణ వ్యవస్థ మనకు పలు సంకేతాలను తెలియజేస్తుంది. వాటిని గమనించడం ద్వారా మన జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించిందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
మన జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోతే అప్పుడు మన శరీరం పలు లక్షణాలను తెలియజేస్తుంది. పొట్ట లేదా ఛాతిలో తరచూ మంటగా అనిపిస్తుండడం, గొంతులోనూ మంటగా ఉండడం వంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే మీకు అసిడిటీ ఉందని అర్థం. జీర్ణాశయంలో ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అయ్యి గొంతు వరకు యాసిడ్లు వస్తాయి. దీంతో పొట్టతోపాటు ఛాతి, గొంతులో మంటగా అనిపిస్తుంది. అసిడిటీ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను కలిసి చికిత్స తీసుకోవాలి. కొంత కాలం మసాలా ఆహారాలు, కారం, టీ, కాఫీ, మద్యం తక్కువగా తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి. దీంతో అసిడిటీ తగ్గుతుంది.
జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోతే గ్యాస్ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది. ఇది పొట్టలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వెనుక నుంచి, గొంతులో నుంచి గ్యాస్ తరచూ బయటకు వస్తుంటుంది. అలాగే భోజనం చేసే సమయంలో, భోజనం చేసిన వెంటనే కూడా గ్యాస్ వస్తుంది. దీంతో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతుంటారు. కడుపు అంతా ఉబ్బరంగా ఉంటుంది. అలాగే కాస్త ఆహారం తీసుకోగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇందుకు పొట్టలో గ్యాస్ పేరుకుపోవడమే కారణం. దీంతో ఎల్లప్పుడూ లేదా భోజనం చేసిన సమయంలో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు.
జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. తరచూ అజీర్తి సమస్య వస్తుంటుంది. దీని వల్ల కొందరిలో విరేచనాలు అవుతాయి. లేదా కొందరిలో మలబద్దకం సమస్య వస్తుంది. తరచూ ఇలా జరుగుతుందంటే జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి. కొందరికి ఆహారం తినేటప్పుడు గ్యాస్ గొంతులోనే ఉంటుంది. బయటకు రాదు. దీంతో ఆహారాన్ని, నీళ్లను సరిగ్గా తీసుకోలేకపోతుంటారు. జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తే కొందరికి తరచూ అజీర్తి ఏర్పడి కడుపులో నొప్పి వస్తుంది. ఇలా పలు లక్షణాలు కనుక తరచూ కనిపిస్తుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా లేదని గుర్తించాలి. వెంటనే డాక్టర్ను కలిసి చికిత్స తీసుకోవాలి. దీంతో జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడకుండా ముందుగానే జాగ్రత్త వహించవచ్చు.