Proteins | మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. కండరాల నిర్మాణంలో, జుట్టు ఆరోగ్యానికి, కణాల మరమ్మత్తుకు, రోగనిరోధక శక్తికి మద్దతు ఇవ్వడంలో, హార్మోన్ల తయారీకి ఇలా అనేక రకాలుగా ప్రోటీన్ మనకు అవసరమవుతుంది. చికెన్ బ్రెస్ట్, గుడ్లు, చేపలు వంటి ఆహారాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అయితే శాకాహారులకు మాత్రం ప్రోటీన్ ను తీసుకోవడం ఎల్లప్పుడూ ఒక సవాలే అని చెప్పవచ్చు. కానీ శాకాహారులు కూడా ప్రోటీన్ ను తీసుకునే విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్ కలిగిన మొక్క ఆధారిత ఆహారాలు మన శరీరానికి రెట్టింపు ప్రయోజనాలను అందిస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. మొక్క ఆధారిత ప్రోటీన్ వనరులను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగుల ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరానికి ప్రోటీన్ ను అందించే సరైన వనరులను ఎంచుకోవడం ద్వారం ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడంతో పాటు మైక్రోబయోమ్ ను కూడా పోషించవచ్చు. మొక్క ఆధారిత ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలను కూడా అందించవచ్చు. అంతేకాకుండా ఇవి ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మన శరీరానికి ప్రోటీన్ ను అందించే కొన్ని మొక్క ఆధారిత ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శాకాహారులు పచ్చిబఠాణీలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్ ను పొందవచ్చు. అరకప్పు పచ్చిబఠాణీని తీసుకోవడం వల్ల 5 గ్రాముల ప్రోటీన్ ను పొందవచ్చు. అలాగే వీటిలో విటమిన్ కె, ఫైబర్, జింక్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు కలుగుతుంది. కూరలు, ఫ్రైడ్ రైస్ వంటి వాటిల్లో పచ్చిబఠాణీని చేర్చడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.
అలాగే సోయాబీన్స్ లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అరకప్పు సోయాబీన్స్ గింజల్లో 9 గ్రాముల ప్రోటీన్, 4 గ్రాముల ఫైబర్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోయాబీన్స్ ఐసోఫ్లేవోన్ లను కలిగి ఉంటుంది. కనుక వీటిని తీసుకోవడం వల్ల బిఫిడో బాక్టీరియా, లాక్టోబాసిల్లస్ వంటి మేలు చేసే బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. అంతేకాకుండా సోయాబీన్స్ ను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ఒక కప్పు ఓట్స్ లో 10గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల ఫైబర్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. జీర్ణవ్యవస్థకు కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.
అదే విధంగా శాకాహారులు సోయాబీన్స్ తో తయారు చేసిన టెంపేను కూడా తీసుకోవచ్చు. 100గ్రాముల టెంపేలో 19గ్రాముల ప్రోటీన్, 6 గ్రాముల ఫైబర్ ఉంటాయి. దీన్ని పులియబెట్టి తయారు చేస్తారు కనుక పేగు ఆరోగ్యానికి దోహదపడుతుంది. అదే విధంగా కాయధాన్యాలను తీసుకోవడం ద్వారా కూడా మనం తగినంత ప్రోటీన్ ను పొందవచ్చు. కేవలం అరకప్పు కాయధాన్యాల్లో 9గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల ఫైబర్ ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శాకాహారులు కూడా తగినంత ప్రోటీన్ ను పొందవచ్చు. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని పోషకాహార వైద్యులు తెలియజేస్తున్నారు.