Heart Attack | ప్రస్తుతం చాలా మంది నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉరుకుల పరుగుల బిజీ యుగంగా మారడంతో చాలా మంది పని ఒత్తిడితోపాటు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, కుటుంబ పరిస్థితుల కారణంగా ఒత్తిడి బారిన పడుతున్నారు. దీంతో ఆందోళన మొదలై డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. ఫలితంగా కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. ఉన్న చోటనే కుప్పకూలి హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. అయితే ఇందుకు శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవడమే కాదు ఎంతో కొంత శారీరక శ్రమ చేయాలని వారు చెబుతున్నారు. రోజూ శారీరక శ్రమ చేయడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని వారు అంటున్నారు.
ఎమోరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వ్యాయామానికి, గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధంపై అధ్యయనం చేశారు. దీని తాలూకు వివరాలను వారు సర్క్యులేషన్ రీసెర్చ్ అనే జర్నల్‌లో ప్రచురించారు. వారు చెబుతున్న ప్రకారం.. రోజూ శారీరక శ్రమ చేసే వారికి హార్ట్ ఎటాక్ లేదా ఇతర గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. శారీరక శ్రమ చేయడం వల్ల మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని వారు చెబుతున్నారు. ఇది గుండెకు ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుందని వారు అంటున్నారు.
రక్త నాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరిగితే దాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. అలాగే తరువాతి అవసరాలకు కూడా నైట్రిక్ ఆక్సైడ్‌ను స్టోర్ చేసుకుంటుంది. దీంతో గుండెకు హాని జరగకుండా ఉంటుంది. శరీరంలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను వెడల్పుగా చేస్తుంది. రక్త నాళాలను యాక్టివ్‌గా ఉంచుతుంది. దీంతోపాటు రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ సల్ఫర్ ద్వారా ప్రోటీన్లలో కలుస్తుంది. ఆక్సిజన్ లేదా రక్త సరఫరా తక్కువ అయినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ వాటి సరఫరాను మెరుగు పరుస్తుంది. ఇలా నైట్రిక్ ఆక్సైడ్ గుండెకు రక్షణ కవచంలా నిలుస్తుందని వారు అంటున్నారు. కనుక రోజూ శారీరక శ్రమ చేయాలని వారు చెబుతున్నారు.
శరరీంలో నైట్రేట్, నైట్రోసోథియల్స్ రూపంలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ గుండె పోటు రాకుండా నివారిస్తుందని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. ఎమోరీ యూనివర్సిటీకి చెందిన మెడిసిన్ ప్రొఫెసర్లు జాన్ కాల్వర్ట్, డేవిడ్ లీఫర్లు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, గుండె పోటు రాకుండా ముందుగానే అడ్డుకోవాలన్నా వ్యాయామం తప్పనిసరి అని వారు చెబుతున్నారు. వ్యాయామం చేయడం వల్ల కేవలం గుండె ఆరోగ్యంగా ఉండడమే కాదు మనకు పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేసినా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని, దీంతో కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గుతాయని, అధిక బరువు తగ్గుతారని చెబుతున్నారు. కాబట్టి మీ రోజువారి దినచర్యలో కచ్చితంగా వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వండి. రోజుకు కనీసం 30 నిమిషాలు ఏదో ఒక విధంగా శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.