Liver Damage | మన శరీరంలో అంతర్గతంగా ఉన్న అతి పెద్ద అవయవాల్లో లివర్ ఒకటి. ఇది సుమారుగా 500 కు పైగా జీవక్రియలను నిర్వర్తిస్తుంది. రక్తంలో ఉన్న మలినాలు, టాక్సిన్లను బయటకు పంపించడం, మనం తీసుకునే ఔషధాలను, ఆహారంలో ఉండే పోషకాలను శరీరానికి అందేలా చూడడం, మనం తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు అవసరం అయిన పైత్య రసాన్ని ఉత్పత్తి చేయడం వంటి అనేక పనులు చేస్తుంది. అయితే మనం పాటించే అలవాట్లు, తినే ఆహారం కారణంగా తరచూ లివర్‌పై భారం పడుతుంది. దీంతో దీర్ఘకాలంలో అది లివర్ డ్యామేజ్ అయ్యేందుకు దారి తీస్తుంది. లివర్ డ్యామేజ్ అయ్యేందుకు దారి తీసే కారణాల్లో మద్యం సేవించడం కూడా ఒకటి. ప్రస్తుతం చాలా మంది అధికంగా మద్యాన్ని సేవిస్తున్నారు. ఆల్కహాల్ అనేది లివర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మద్యం సేవించిన తరువాత దాన్ని శరీరం నుంచి బయటకు పంపించేందుకు లివర్ తీవ్రంగా శ్రమిస్తుంది.
తరచూ మద్యం సేవిస్తే ఒకానొక దశలో లివర్ పనితీరు మందగిస్తుంది. దీంతో శరీరంలో టాక్సిన్లు పేరుకుపోతాయి. ఫలితంగా లివర్ డ్యామేజ్ అవుతుంది. మద్యం అధికంగా సేవించేవారికి ఫ్యాటీ లివర్ అనే సమస్య వస్తుంది. మద్యం సేవించడం కారణంగా శరీరంలో అధికంగా ఉండే కొవ్వును లివర్ కరిగించలేదు. దీంతో ఆ కొవ్వు లివర్‌లో పేరుకుపోతుంది. దీర్ఘకాలంలో ఇది ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తుంది. కనుక మద్యం అతిగా సేవించకూడదు. కొందరు మద్యం ప్రియులకు లివర్ సిర్రోసిస్ అనే జబ్బు కూడా వస్తుంది. ఇది మరీ మద్యం శృతి మించి తాగితే వస్తుంది. చాలా ప్రమాదకరమైంది. కనుక మద్యం అధికంగా సేవిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలి. దాన్ని మానే ప్రయత్నం చేయాలి. లేదంటే లివర్ డ్యామేజ్ అవుతుంది.
కొందరు మద్యం సేవించకపోయినా, నాన్ వెజ్ వంటి ఆహారాలను అధికంగా తినకపోయినా వారి లివర్ డ్యామేజ్ అవుతుంది. అందుకు కారణం అలాంటి వారు చిరు తిళ్లను అధికంగా తినడమే. చిరు తిళ్లను, స్వీట్లను అధికంగా తిన్నా కూడా లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యకు కారణం అవుతుంది. నాన్ వెజ్‌ను అధికంగా తిన్నా కూడా ఈ సమస్య వస్తుంది. కనుక ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, వేపుళ్లు, ఇతర జంక్ ఫుడ్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి అనారోగ్యకరమైన కొవ్వులు. శరీరంలో ఇవి అధికంగా చేరితే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి లివర్‌లో సైతం కొవ్వు చేరుతుంది. ఇది ఫ్యాటీ లివర్‌కు కారణం అవుతుంది. కనుక ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి. పండ్లు, కూరగాయలను తింటుంటే మేలు జరుగుతుంది.
కొన్ని రకాల మందులను దీర్ఘకాలంగా వాడడం వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. జ్వరం తగ్గేందుకు కారణం అయ్యే పారాసిటమాల్ (డోలో) వంటి మందులు, పెయిన్ కిల్లర్ ఔషధాలు వంటి వాటిని దీర్ఘకాలంగా ఉపయోగిస్తే వాటి ప్రభావం లివర్‌పై పడి లివర్ డ్యామేజ్ అయ్యేందుకు కారణం అవుతాయి. అలాగే నిత్యం గంటల తరబడి కూర్చుని పనిచేసే వారి లివర్ డ్యామేజ్ అయ్యేందుకు కూడా అవకాశాలు అధికంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ అయినా చేయాలని సూచిస్తున్నారు. పొగ తాగడం కూడా లివర్ డ్యామేజ్‌కు దారి తీస్తుంది. చాలా మంది రోజూ పెట్టెల కొద్ది సిగరెట్లను కాలుస్తుంటారు. ఇది లివర్‌కు మంచిది కాదు. ఆ అలవాటును మానుకుంటే మంచిది. ఇలా కొన్ని రకాల కారణాల వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. కనుక ఆయా విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.