Digestive System | చాలా మందికి జీర్ణ సమస్యలు అయితే వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. మనం పాటించే జీవన విధానంతోపాటు తీసుకునే ఆహారం, ఇతర అంశాలు కూడా మన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. అయితే కొన్ని రకాల అలవాట్ల వల్ల మాత్రం మన జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది. వాటిని పాటించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మంచి అలవాట్లో జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ చెడు అలవాట్లు ఉంటే మాత్రం జీర్ణ వ్యవస్థ పని అయిపోయినట్లే అని వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాట్లు గనక మీకు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలా ఒకే సమయానికి భోజనం చేయాలి. అది కూడా త్వరగా భోజనం చేయాలి. రోజూ ఇష్టం వచ్చిన సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు గాడి తప్పుతుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్యాస్, అజీర్ణం, మలబద్దకం, కడుపు నొప్పి వస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం అస్తవ్యస్తంగా మారుతుంది. కనుక రోజూ ఒకే సమయానికి, అది కూడా త్వరగా తినడం అలవాటు చేసుకోండి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇక రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలనే తినండి. చాలా మంది జంక్ ఫుడ్, నూనె పదార్థాలను అధికంగా తింటుంటారు. వీటి వల్ల కూడా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది. కనుక ఈ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తినాల్సి ఉంటుంది.
చాలా మంది అన్ని అలవాట్లను సరిగ్గానే పాటిస్తుంటారు. కానీ నిద్ర విషయంలో మాత్రం తప్పు చేస్తుంటారు. రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోతుంటారు. ఉదయం కూడా నిద్ర ఆలస్యంగా లేస్తుంటారు. ఇలా జరుగుతుండడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది. అజీర్తి సమస్య వస్తుంది. అలాగే జీవ గడియారం సక్రమంగా ఉండదు. కనుక జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే త్వరగా నిద్రపోయి త్వరగా నిద్రలేవాలి. అలాగే అతిగా కూడా నిద్రించకూడదు. రోజుకు తగినన్ని గంటలపాటు నిద్రించడం వల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
కొందరు ఆహారాలను సరిగ్గా తీసుకోరు. ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం మానేస్తుంటారు. లేదా ఆలస్యంగా తింటుంటారు. అస్తవ్యస్తమైన ఆహార నియమాలను కలిగి ఉంటారు. ఇలా కలిగి ఉండడం కూడా మంచిది కాదు. దీంతో కూడా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది. కనుక సమయానికి భోజనం చేయాలి. అలాగే భోజనం మానేయకూడదు. దీని వల్ల బరువు పెరుగుతారు తప్ప తగ్గరు. బరువు పెరుగుతామన్న భయం ఉంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇవి బరువును తగ్గించేందుకు సహాయం చేస్తాయి.
చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను మానేసి నేరుగా మధ్యాహ్నం లంచ్ చేస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేసే వారు రోజులో మిగిలిన సమయంలో భోజనం అధికంగా తింటారని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను ఎక్కువగానే తీసుకోవాలి. అందులో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే మంచిది. ఇక మధ్యాహ్నం ఒక మోస్తరుగా భోజనం చేయాలి. రాత్రి ఎంత తక్కువ తింటే అంత మంచిది. అంతే కానీ ఏ పూట కూడా భోజనం మానేయకూడదు. ఇది జీర్ణ సమస్యలను కలగజేస్తుంది. జీర్ణ వ్యవస్థకు చేటు చేస్తుంది. ఇలా కొన్ని అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.