Diabetes | మనల్ని వేధించే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో టైప్ 2 డయాబెటిస్ కూడా ఒకటి. చాలా మంది షుగర్ వ్యాధే కదా అని తేలికగా తీసుకుంటారు. దాని తీవ్రత, ప్రమాదం గురించి చాలా మందికి తెలియదు. డయాబెటిస్ వ్యాధి మొత్తం శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు టైప్ 2 డయాబెటిస్ అభివృద్ది చెందుతుంది. మన శరీరంలో ఈ టైప్ 2 డయాబెటిస్ చాలా నిశ్శబ్దంగా అభివృద్ది చెందుతుంది. వయసు పైబడడం, శరీర బరువు, వంశపారపర్యత, శారీరక వ్యాయామం లేకపోవడం, ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవడం వల్ల ఇలా అనేక అంశాలు దీనిని ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి సమస్యల కారణంగా కూడా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం తేలికగా తీసుకునే చాలా అంశాలు డయాబెటిస్ కు కారణమవుతాయి. మన జీవనశైలి, మన అలవాట్లు డయాబెటిస్ ను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో అలాగే దీనిని నివారించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరాన్ని కదలించకుండా ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగే అవకాశం ఉంది. దీంతో శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కష్టతరమవుతుంది. కాలక్రమేణా శరీరం ఇన్సులిన్ కు సున్నితంగా మారుతుంది. క్లోమం ఎక్కువ ఇన్సులిన్ ను తయారు చేయాల్సి వస్తుంది. చివరికి ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. కాలక్రమేణా ఇది టైప్ 2 డయాబెటిస్ అభివృద్దికి దారి తీస్తుంది. మనం అధిక క్యాలరీలు తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. ముఖ్యంగా పొట్ట, నడుము చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. ఇది క్రమంగా అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. దీర్ఘకాలిక బరువు తగ్గించే లక్ష్యాలను కూడా ఆలస్యం చేస్తుంది. శరీర కూర్పును మరింత దిగజార్చడంతో పాటు డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇక డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. వ్యాయామం చేసినప్పటికీ ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల శరీర కొవ్వులు రక్తంలో గ్లూకోజ్ ను ప్రాసెస్ చేయకుండా అంతరాయం కలిగిస్తుంది. దీంతో శరీరం ఇన్పులిన్ ను తక్కువగా ఉపయోగిస్తుంది.
ఎక్కువ సమయం పాటు కూర్చోకుండా ప్రతి అరగంటకు ఒకసారి కదులుతూ ఉండాలి. అలాగే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారు రోజూ అరగంట చొప్పున నడవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇలా నడవడం వల్ల శరీర బరువు 5 నుండి 7 శాతం తగ్గుతుంది. ఫలితంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం 58 శాతం వరకు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే వారానికి రెండు సార్లు బరువైన వ్యాయామాలు చేయాలి. బరువైన వ్యాయామాలు చేయడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ పెరుగుతుంది. లిపిడ్ ప్రొఫైల్స్ మెరుగుపడతాయి. అలాగే పొట్ట చుట్టూ ఉండే అధిక కొవ్వును తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇక వ్యాయామం చేయడంతో పాటు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు, లీన్ ప్రోటీన్లను, కూరగాయలు, పండ్లు వంటి వాటిని తీసుకోవాలి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.