Stress | ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలతో కూడా బాధపడుతున్నారు. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, గందరగోళం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. మారిన మన జీవన విధానమే ఈ సమస్యలకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. శారీరక సమస్యల లాగా మానసిక సమస్యలకు కూడా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. మానసిక సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి క్రమంగా తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తాయి. డిప్రెషన్ వంటి మానసికపరమైన సమస్యలతో బాధపడే వారు తమ జీవనశైలిని మార్చుకోవడంతో పాటు డిప్రెషన్ ను తగ్గించే ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను తగ్గించే ఆహారాల గురించి పోషకాహార వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
శారీరానికి శక్తిని, బలాన్ని అందించడంలో అశ్వగంధ ఎంతగానో సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, అలసట, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో దీనిని ఎంతోకాలంగా ఉపయోగిస్తున్నారు. అశ్వగంధ , బ్రాహ్మిని సమాన నిష్పత్తిలో తీసుకుని టీ తయారు చేసి తీసుకోవాలి. రోజుకు రెండుసార్లు ఇలా తీసుకోవడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది. భయం, ఆందోళన, నిద్రలేమి సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. డిప్రెషన్, నిరాశ వంటి వాటిని తగ్గించడంలో తులసి మనకు ఎంతో సహాయపడుతుంది. తులసి ఆకులతో చేసిన టీని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.
కోపం, భయం, వైఫల్యం, నిరాశ, నియంత్రణ కోల్పోవడం సమస్యలను తగ్గించడంలో బ్రాహ్మి ఎంతగానో సహాయపడుతుంది. రోజుకు రెండు నుండి మూడు సార్లు బ్రాహ్మి టీని తీసుకోవడం వల్ల మనసుకు ఎంతో తేలికగా ఉంటుంది. మానసిక సమస్యలు దూరమవుతాయి. ఆపిల్ జ్యూస్ ను తాగడం వల్ల డిప్రెషన్ తగ్గడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఆపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల మానసిక భారం తగ్గుతుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గి శరీరానికి శక్తి లభిస్తుంది. శరీరం నూతన ఉత్తేజంతో పని చేస్తుంది. ఓట్స్ లో ఆల్కలాయిడ్ గ్రామైన్ ఉంటుంది. ఇది సహజ ఉపశమనకారిగా ఉంటుంది. నిరాశ, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో ఓట్స్ గడ్డితో చేసిన టీ మనకు ఎంతో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించే సహజ నివారిణిలలో ఇది ఒకటి.
ఒత్తిడి, ఆందోళన, భయం, నిరాశ వంటి మానసిక సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి తీవ్రమయ్యే కొద్దీ ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయి. కనుక ఇటువంటి మానసికపరమైన సమస్యలతో బాధపడే వారు ఇప్పుడు చెప్పిన టీలను తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.