High Cholesterol | శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. సాధారణంగా మనం వాకింగ్ చేస్తున్నప్పుడు కాళ్లు, తొడలు, పిరుదులు వంటి భాగాల్లో నొప్పి వస్తూ ఉంటుంది. ఇది అడపాదడపా జరుగుతుంది. కొంత విశ్రాంతి తీసుకున్న తరువాత తగ్గిపోతుంది. కానీ వాకింగ్ చేసేటప్పుడు కాళ్ల నొప్పి ఎక్కువగా ఉండడం, విశ్రాంతి తీసుకున్న తరువాత కూడా తగ్గకపోవడం వంటి లక్షణాలు అధిక కొలెస్ట్రాల్ ను కూడా సూచిస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా ఎటువంటి లక్షణాలు చూపించదు. వాకింగ్ చేసేటప్పుడు మన శరీరం కొన్ని లక్షణాలను చూపిస్తుంది.
ధమనుల్లో కొలెస్ట్రాల్ అడ్డుపడడం వల్ల నడిచిన ప్రతిసారి నొప్పితో పాటు వింత అనుభూతి కలుగుతుంది. ధమనుల్లో కొలెస్ట్రాల్ అడ్డుగా ఉండడం వల్ల నడిచేటప్పుడు ఆక్సిజన్ ఉన్న రక్తం సరిగ్గా సరఫరా అవ్వదు. దీంతో నడిచేటప్పుడు నొప్పితో పాటు కాళ్లు బరువుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెట్లు ఎక్కడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల కాలక్రమేణా రక్తప్రసరణ బలహీనపడుతుంది. కండరాలు కుచించుకుపోతాయి. కొంతకాలానికి నడవడం, నిలబడడం కూడా కష్టతరంగా మారుతుంది. అంతేకాకుండా నడిచిన తరువాత ఒక కాలు చల్లగా మరో కాలు వేడిగా ఉండడం వంటి లక్షణాలు కూడా ధమనుల్లో అధిక కొలెస్ట్రాల్ ను సూచిస్తాయి. రక్తం వెచ్చగా ఉంటుంది. రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల కాలు తగినంత వేడెక్కక చల్లగా ఉంటుంది. నడిచిన తరువాత కాలు చల్లగా ఉండడం, కాలు రంగు మారడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
అలాగే నడిచేటప్పుడు కాళ్లు తిమ్మిర్లు రావడం, గుచ్చినట్టుగా ఉండడం కూడా ఒక సంకేతమే. నడిచేటప్పుడు నరాలకు ఆక్సిజన్ తో కూడిన రక్తం నిరంతరం సరఫరా అవ్వాలి. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తం సరఫరా అవ్వక నరాల పనితీరు దెబ్బతింటుంది. దీంతో పాదాల్లో తిమ్మిర్లు, మంట, స్పర్శ కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసేకొద్దీ పాదాలపై అల్సర్లు, ఇన్పెక్షన్లు, పాదాలపై నెమ్మదిగా గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అలాగే అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారిలో నడిచిన తరువాత పాదాల రంగు మారుతుంది. చర్మం పాలిపోయినట్టు కనబడడం, నీలి లేదా ఊదా రంగులో కనబడడం వంటి లక్షణాలు అధిక కొలెస్ట్రాల్ ను సూచిస్తాయి. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల చర్మ కణజాలానికి ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది. సమస్య పెరిగే కొద్ది కాళ్లపై వెంట్రుకలు ఊడిపోవడం, కాలి వేళ్లపై, పాదాలపై నయం కాని పుండ్లు పడడం కూడా జరుగుతుంది. కనుక నడిచే సమయంలో ఇటువంటి లక్షణాలను గమనించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అధిక కొలెస్ట్రాల్ సమస్య గుండె జబ్బులకు, స్ట్రోక్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. కనుక అధిక కొలెస్ట్రాల్ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు.