ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2019లోనే కోటి ఎనభై లక్షల మంది గుండెపోటు, స్ట్రోక్ తో మరణించారు. ఆ తర్వాత నుంచి కూడా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు లక్షణాలు కనిపిస్తే.. ఈ నాలుగు విషయాలను పాటించాలి.
ఎమర్జెన్సీ కాల్: ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేయాలి. ఓపిక చేసుకుని మరీ, ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌కు ఫోన్ చేయాలి. కుదిరితే దవాఖానకు వెళ్లేదాకా తెలిసిన డాక్టర్‌తో ఫోన్ కాల్లో ఉండటం మంచిది.
అందుబాటులో ఆస్పత్రి: మీ ఇంటి పరిసరాల్లో మంచి దవాఖాన ఎక్కడ ఉందో తెలుసుకొని ఉండటం మంచిది. ఆ ఆస్పత్రికి సంబంధించిన ఫోన్ నెంబర్లు దగ్గర ఉంచుకోండి. అత్యవసర పరిస్థితిలో నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. తద్వారా 90 శాతం ప్రాణహాని తగ్గుతుంది.
మంచంపై పడుకోవాలి: అంబులెన్స్ వచ్చేవరకు మంచంపై పడుకోవాలి. అలాగే కాళ్లు ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే రక్త ప్రసరణ మెరుగై, శ్వాస బాగా ఆడుతుంది. కొందరికి కూర్చుంటే ఆయాసం తగ్గుతుంది. అలాంటివాళ్లు ఎక్కువగా కదలకుండా కుర్చీలో కూర్చున్నా
పర్వాలేదు.
ఆత్మీయులకు ఫోన్: ఎమర్జెన్సీ కాల్ తర్వాత కుటుంబ సభ్యులకు లేదా మిత్రులకు ఫోన్ చేయాలి. ‘అంబులెన్స్ రాబోతున్నది, వచ్చాక నేను దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్తాన’ని తెలియజేయాలి. దీనివల్ల వాళ్లు అక్కడికి త్వరగా చేరుకుని, మెడికల్ స్టాఫ్‌కు పేషెంట్ హిస్టరీ చెప్పడం, ఇన్సూరెన్స్ లేదా బిల్లు విషయంలో తోడ్పడతారు.