Hangover | నేటి తరుణంలో యువత ఎక్కువగా రాత్రి సమయం పార్టీల పేరుతో గడిపేస్తున్నారు. రాత్రి పార్టీ చేసుకునేటప్పుడు బాగానే ఉన్నా మరుసటి రోజు మాత్రం కథ వేరేలాగా ఉంటుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల , అతిగా తినడం వల్ల అలసట, శరీర నొప్పులు, వికారం, తలనొప్పి, వాంతులు, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా శరీరం డీహైడ్రేటెడ్ గా మారడం, కడుపులో చికాకు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అధికంగా మద్యం తీసుకోవడం వల్ల మూత్రవిసర్జన ఎక్కువగా ఉంటుంది. పేగుల పొర దెబ్బతింటుంది. కాలేయ పనితీరు మందగిస్తుంది. ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను, రోగనిరోధక శక్తిని కూడా మద్యం ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి సమస్యలు కూడా తలెత్తుతాయి. కనుక పార్టీ చేసుకున్న తరువాత శరీరం కోలుకోవడానికి తగిన సమయాన్ని ఇవ్వాలి. సరైన ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. పార్టీ చేసుకున్న తరువాత వచ్చే అసౌకర్యాన్ని తగ్గించే కొన్ని చిట్కాల గురించి వైద్యులు వివరిస్తున్నారు.
ఆల్కహాల్ మూత్రవిసర్జన ఎక్కువ అయ్యేలా చేస్తుంది. దీంతో శరీరం ద్రవాలను కోల్పోతుంది. కనుక ఉదయం నిద్రలేచిన తరువాత సాధారణ నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కొబ్బరి నీళ్లు, ఒఆర్ఎస్, ఉప్పు, చక్కెర కలిపిన నీరు తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరం కోల్పోయిన నీరు తిరిగి అందుతుంది. ఎలక్ట్రోలైట్స్ పునరుద్దరించబడతాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. పార్టీ తరువాత జీర్ణాశయంలో చికాకు ఎక్కువగా ఉంటుంది. కనుక పెరుగన్నం, కిచిడీ, అరటిపండ్లు, ఉడికించిన గుడ్లు, టోస్ట్ లేదా బ్రెడ్ వంటి వాటిని తీసుకోవాలి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. కనుక పొట్టకు శాంతత చేకూరుతుంది. వీటిని తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల వికారం, ఆమ్లత్వం తగ్గుతాయి. గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
మద్యం తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం నిద్రపోయినప్పటికీ గాఢ నిద్రకు ఇది భంగం కలిగిస్తుంది. కనుక పార్టీ చేసుకున్న తరువాత పగటి పూట నిద్రించాలి. అలాగే సూర్యకాంతి శరీరానికి తగిలేలా చర్యలు తీసుకోవాలి. కొద్దిగా నడవడం, చిన్న చిన్న పనులు చేయడం వల్ల రాత్రి పూట నిద్రపడుతుంది. నిద్రలేమి సమస్యలు రాకుండా ఉంటాయి. పార్టీ తరువాత నొప్పులు తగ్గడానికి చాలా మంది మందులను వాడుతూ ఉంటారు. కానీ మందులను వాడడం కంటే నీటిని ఎక్కువగా తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆల్కహాల్ తీసుకున్న తరువాత మందులు వేసుకోవడం వల్ల కాలేయంపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీంతో కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక పార్టీ తరువాత మందులను వాడకపోవడమే మంచిది. ఒకవేళ మందులు వేసుకున్నప్పటికీ ఆల్కహాల్, మీరు తీసుకున్న మందులు కలవకుండా చూసుకోవాలి.
మద్యం తాగిన తరువాత హ్యాంగోవర్ లక్షణాలు రావడం సహజం. కానీ తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, ఛాతీలో అసౌకర్యం, తల తిరిగినట్టుగా ఉండడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు జీర్ణాశయాంతర రక్తస్రావం లేదా ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. కనుక లక్షణాలు గుర్తించి జాగ్రత్తగా ఉండడం అవసరం. చాలా మంది పార్టీ చేసుకున్న తరువాత కోలుకోవడానికి ఖరీదైన డీటాక్స్ పానీయాలను తాగుతూ ఉంటారు. కానీ ఇవి అవసరం లేదని మన శరీరం మనకు చూపించే లక్షణాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.