Hangover Home Remedies | మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది విపరీతంగా మద్యం సేవిస్తూనే ఉంటారు. ఇక కొందరు అయితే మద్యం మళ్లీ దొరుకుతుందో లేదో అని చెప్పి పీకల దాకా సేవిస్తుంటారు. ఆపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. కొందరు మద్యం విపరీతంగా సేవించి వాంతులు చేసుకుంటారు. అయితే మద్యం విపరీతంగా సేవించిన తరువాత కొన్ని గంటలకు ఉదయం లేదా రాత్రి ఎప్పుడైనా సరే హ్యాంగోవర్ వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, వికారం వంటి సమస్యలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే హ్యాంగోవర్ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాగా హ్యాంగోవర్ సమస్య ఉన్నవారు మసాలా చాయ్‌ని సేవించాలి. యాలకులు, లవంగాలు, మిరియాలు, శొంఠి వేసి తయారు చేసిన మసాలా టీని సేవిస్తే హ్యాంగోవర్ దెబ్బకు ఎగిరిపోతుంది. దీంతోపాటు తలనొప్పి కూడా తగ్గుతుంది. హ్యాంగోవర్‌ను తగ్గించడంలో మసాలా టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఆయా మసాలాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సమ్మేళనాలు మెదడును యాక్టివ్‌గా మారుస్తాయి. మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. మెదడులో ఉండే రక్త నాళాలకు రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. హ్యాంగోవర్, తలనొప్పి తగ్గుతాయి. కనుక తీవ్రమైన హ్యాంగోవర్ ఉన్నవారు మసాలా టీని ట్రై చేసి చూడండి.
ఇక హ్యాంగోవర్ నుంచి బయట పడేందుకు నిమ్మరసం కలిపిన మజ్జిగ కూడా ఎంతగానో పనిచేస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మనల్ని తాజాగా ఉంచేలా చేస్తుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్తేజంగా పనిచేస్తుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగినా కూడా హ్యాంగోవర్ నుంచి బయట పడవచ్చు. ఈ మిశ్రమంతో తలనొప్పి కూడా తగ్గుతుంది. అలాగే వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక ఈ సమస్యల నుంచి బయట పడేందుకు అల్లం రసం కూడా ఎంతో పనిచేస్తుంది. ఇది తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ లేకుండా చేస్తుంది. అలాగే శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హ్యాంగోవర్, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తీవ్రమైన హ్యాంగోవర్ ఉంటే తలకు ఏదైనా హెర్బల్ ఆయిల్‌తో మసాజ్ కూడా చేయవచ్చు. దీంతో తలలో రక్త సరఫరా పెరుగుతుంది. హ్యాంగోవర్, తలనొప్పి తగ్గుతాయి. అదేవిధంగా కాఫీ లేదా గ్రీన్ టీ సేవించినా కూడా ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో ఉండే కెఫీన్ మెదడును ఉత్తేజితం చేస్తుంది. దీని వల్ల తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. అదేవిధంగా యాపిల్ లేదా అరటి పండ్లను తింటున్నా కూడా హ్యాంగోవర్ నుంచి బయట పడవచ్చు. పుదీనా ఆకులను నమిలి తింటున్నా లేదా గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి తాగుతున్నా కూడా హ్యాంగోవర్, తలనొప్పి తగ్గిపోతాయి. వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం నుంచి కూడా విముక్తి లభిస్తుంది.