Digestive Problems | జీర్ణ సమస్యలు అనేవి మనకు సహజంగానే వస్తుంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అజీర్తి వస్తుంది. దీంతోపాటు పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది. కారం, మసాలాలు ఉండే ఆహారాలను అతిగా తిన్నా కూడా ఇలా జరుగుతుంది. కొందరికి వీటిని తింటే కడుపులో మంట కూడా ఏర్పడుతుంది. అలాగే టీ, కాఫీలను అధికంగా తాగడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం, వ్యాయామం చేయకపోవడం, పీచు లేని ఆహారాలను తినడం, అతిగా తినడం వంటివి కూడా జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి. అయితే జీర్ణ సమస్యలు వచ్చాక బాధపడడం కంటే అవి రాక ముందే జాగ్రత్త పడాలి. చాలా వరకు జీర్ణ సమస్యలు మనం తీసుకునే ఆహారం వల్లే వస్తుంటాయి. కనుక ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం. అయితే జీర్ణ సమస్యలు వస్తే ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజసిద్ధంగా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలను తగ్గించడంలో నేరేడు పండ్ల గింజలు ఎంతో ఉపయోగపడతాయి. నేరేడు పండ్ల గింజలకు చెందిన పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది. ఈ పొడిని తెచ్చుకోవాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఈ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో కలిపి తాగుతుండాలి. దీంతో ఎలాంటి జీర్ణ సమస్య అయినా సరే తగ్గిపోతుంది. అలాగే ఈ సీజన్లో లభించే నేరేడు పండ్లను తింటున్నా కూడా జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇక జీర్ణ సమస్యలను తగ్గించడంలో అల్లం కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. భోజనం చేయడానికి ముందు ఒక టీస్పూన్ అల్లం రసాన్ని ఉదయం, సాయంత్రం రోజుకు 2 సార్లు సేవించాలి. దీని వల్ల జీర్ణాశయం, పేగుల్లో ఉండే వాపులు తగ్గుతాయి. కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది.
భోజనం చేసిన అనంతరం ఒక గుప్పెడు సోంపు గింజలను తింటున్నా కూడా జీర్ణ సమస్యలు తగ్గుతాయి. సోంపు గింజలను తింటే కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టలో ఉండే గ్యాస్ మొత్తం పోతుంది. అజీర్తి, విరేచనాలు, మలబద్దకం తగ్గుతాయి. జీర్ణ సమస్యలను తగ్గించడంలో సోంపు అద్భుతంగా పనిచేస్తుంది. పేగుల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు త్రిఫల చూర్ణం కూడా తీసుకోవచ్చు. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు టీస్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తాగాలి. దీంతో మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం ఉండదు. జీర్ణాశయం, పేగులు శుభ్రంగా మారుతాయి. శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. త్రిఫల చూర్ణం కూడా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పుదీనా ఆకులు మన శరీరానికి చలువ చేస్తాయి. కనుక ఈ ఆకులను తింటే కడుపులో మంట తగ్గుతుంది. పుదీనా ఆకుల రసాన్ని మజ్జిగలో కలిపి తాగుతుంటే అన్ని జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకులను నేరుగా కూడా నమిలి తినవచ్చు. భోజనానికి ముందు ఈ ఆకులను తింటే గ్యాస్ ఏర్పడదు. అజీర్తి తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది. పొట్టలో ఉండే అసౌకర్యం తగ్గుతుంది. అలాగే జీర్ణ సమస్యలను తగ్గించడంలో తుమ్మ జిగురు కూడా బాగానే పనిచేస్తుంది. మలబద్దకాన్ని ఇది తగ్గిస్తుంది. ఐబీఎస్ వంటి సమస్యలు ఉన్నవారు తుమ్మ జిగురును వాడితే ప్రయోజనం ఉంటుంది. బొప్పాయి పండ్లను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా పలు రకాల పదార్థాలు మనకు ఏర్పడే జీర్ణ సమస్యలను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి.