Diabetes | ప్రపంచ వ్యాప్తంగా ఏటా డయాబెటిస్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా, ఇండియాలలో డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా పెరుగుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ జీవనశైలి పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా చాలా మందికి అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల డయాబెటిస్ వస్తోంది. కనుక జీవనశైలిని ఆరోగ్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇక డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలను పాటించాలి. లేదంటే షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది.
డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలనే తినాల్సి ఉంటుంది. ఎక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను లేదా పండ్లను తింటే షుగర్ లెవల్స్ వెంటనే పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఎక్కువ గ్లైసీమిక్ ఉన్న పండ్లలో అరటి పండు కూడా ఒకటి. అరటి పండును తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువ కనుక డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎట్టి పరిస్థితిలోనూ అరటి పండ్లను తినకూడదు.
పుచ్చకాయలలోనూ చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. కాబట్టి షుగర్ పేషెంట్లు వీటిని కూడా తినకూడదు. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అయిన ఎండు ద్రాక్ష, ఖర్జూరాల్లోనూ గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగానే ఉంటుంది. వీటిని తిన్న వెంటనే షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. కనుక వీటిని కూడా తినవద్దు.
ఇక సాధారణ రైస్ గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక షుగర్ ఉన్నవారు ఈ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తినాలి. లేదా మిల్లెట్స్‌ను తినవచ్చు. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువ. వీటిని తిన్న వెంటనే షుగర్ లెవల్స్ చాలా నెమ్మదిగా పెరుగుతాయి. కనుక బ్రౌన్ రైస్‌తోపాటు, మిల్లెట్స్ చాలా ఆరోగ్యవంతమైన ఆహారం అని చెప్పవచ్చు.
సాధారణంగా షుగర్ లెవల్స్ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకముందు 70 నుంచి 100 మధ్య ఉండాలి. ఆహారం తిన్న తరువాత గంటన్నరకు షుగర్ లెవల్స్ 140 వరకు ఉండవచ్చు. ఈ పరిమితి దాటితే దాన్ని డయాబెటిస్‌గా పరిగణిస్తారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు డయాబెటిస్ పరీక్షలను ఏడాదికి రెండు సార్లు చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్నట్లు తేలితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. దీని వల్ల ముందుగానే డయాబెటిస్‌ను కంట్రోల్ చేసిన వారు అవుతారు. లేదంటే అధిక చక్కెర స్థాయిలు శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపిస్తాయి.
శరీరంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే కిడ్నీలు పాడయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు కంటి చూపు కోల్పోవచ్చు. అలాగే కాళ్లకు పుండ్లు పడి కాళ్లను తీసేసే పరిస్థితి వస్తుంది. మీకు ఎలాంటి అలర్జీ లేకున్నా స్వీట్లను తిన్నప్పుడు లేదా ఇతర సమయాల్లో చర్మంపై దురదలు బాగా వస్తున్నా లేదా దాహం విపరీతంగా అవుతున్నా, రాత్రిపూట మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తున్నా.. దాన్ని షుగర్ గా అనుమానించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ ఉన్నట్లు వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. దీంతో వ్యాధిని ఆరంభంలోనే కంట్రోల్ చేయవచ్చు.