Diabetes | భారత దేశంలో అత్యంత సాధారణమైన వ్యాధుల్లలో డయాబెటిస్ కూడా ఒకటి. ఈ వ్యాధి బారిన పడే వారు రోజు రోజుకీ ఎక్కువవుతున్నారనే చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో పుట్టిన పిల్లలల్లో కూడా ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, తగినంత శ్రమ లేకపోవడం, జన్యుపరమైన కారణాల వల్ల ఈ వ్యాధికి గురవుతున్నారు. అలాగే ఊబకాయంతో బాధపడే వారిలో కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా డయాబెటిస్ వల్ల కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ కారణంగా వ్యక్తి దినచర్య కూడా ప్రభావితమవుతుంది. డయాబెటిస్ తో బాధపడే వారు బరువు తగ్గాలనుకుంటే మరింత శ్రమ పడాల్సి వస్తుంది. ఆహార నియమాలను పాటించడం వల్ల, అధికంగా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు స్పృహ కోల్పోయే అవకాశం కూడా ఉంది. కనుక డయాబెటిస్ తో బాధపడే వారు బరువు తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం చాలా అవసరం.
డయాబెటిస్ మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక క్రమంగా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అయితే వ్యాయామం చేయడం మొదలు పెట్టిన వెంటనే కఠినమైన ఆహార నియమాలను పాటించకూడదు. బరువు తగ్గడానికి శారీరక, మానసిక బలం కూడా అవసరం. కనుక డయాబెటిస్ తో పాటు ఊబకాయంతో బాధపడే వారు మార్గనిర్దేశం చేయడానికి ఇతరుల సహాయ కోరడం మంచిది. వ్యాయామం చేసేవారు వారానికి కనీసం 5 సార్లు వ్యాయామం చేయాలి. దీని వల్ల పొట్ట చుట్టూ అదనంగా ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. అలాగే వ్యాయామం చేసే సమయంలో ఆహారంపై శ్రద్ద వహించడం కూడా చాలా అవసరం. మనం తీసుకునే ఆహారం బరువు తగ్గించే విధంగా ఉండడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేదిగా కూడా ఉండాలి.
రక్తపోటును తగ్గించే డైట్ లలో డ్యాష్ డైట్ ఒకటి. ఈ డైట్ పద్దతిని పాటించడం వల్ల రక్తపోటు అదుపులో ఉండడంతో పాటు డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నప్పటికీ బరువు తగ్గాలనుకునే వారు ఈ డైట్ ను పాటించడం మంచిది. అదే విధంగా డయాబెటిస్ తో బాధపడే వారు తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను తీసుకోవాలి.
డయాబెటిస్ తో బాధపడే వారు చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. డయాబెటిస్ తో బాధపడే వారు వ్యాయామం చేసే విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఒకేసారి అతిగా వ్యాయామం చేయకూడదు. ఇలా చేయడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. కనుక వ్యాయామం చేయడం మెల్లగా ప్రారంభించి క్రమంగా పెంచుకునే ప్రయత్నం చేయాలి.
సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు క్యాలరీలను నియంత్రించాలని ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. కానీ డయాబెటిస్ తో బాధపడే వారు ఆహారాన్ని తీసుకోవడం తగ్గించకూడదు. మూడు పూటలా సరైన సమయంలో ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కార్బొహైడ్రేట్స్ ఉండే ఆహారాలను తీసుకోవడం కూడా ముఖ్యం. తృణ ధాన్యాలను, ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవడం కూడా చాలా అవసరం. అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఉపవాసం ఉండే డైట్స్ ను చేస్తూ ఉంటారు. కానీ డయాబెటిస్ ఉన్న వారు ఇలాంటిది చేయకూడదు. ఉపవాసం ఉండడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. అలాగే బరువు తగ్గడానికి డైట్ మందులను కూడా వాడకూడదు. ఇవి డయాబెటిస్ మందుల పనితీరును దెబ్బతీస్తాయి. అదేవిధంగా జంక్ ఫుడ్ ను తీసుకోవడం కూడా తగ్గించాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ఆహార నియమాలను పాటించడం వల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సులభంగా బరువు తగ్గవచ్చు.