Dark Circles | డార్క్ సర్కిల్స్ సమస్య అనేది ప్రస్తుతం చాలా మందికి కామన్ అయిపోయింది. ఇవి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. జన్యు పరమైన సమస్యలు ఉండడం, వయస్సు మీద పడుతుండడం, నిద్రలేమి, నీళ్లను తగినంతగా తాగకపోవడం, కళ్లపై ఒత్తిడి అధికంగా పడడం, అలర్జీలు, సూర్య కాంతిలో ఎక్కువ సేపు గడపడం, ఇతర జీవనశైలి సంబంధ విషయాలు డార్క్ సర్కిల్స్ వచ్చేందుకు కారణం అవుతాయి. డార్క్ సర్కిల్స్ వస్తే ఒక పట్టాన తగ్గవు. దీంతో వాటిని తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. కేవలం స్త్రీలకే కాకుండా పురుషులకు కూడా ఈ సమస్య వస్తుంటుంది. అయితే ఇందుకు ఖరీదైన చికిత్సలు చేయించుకోవాల్సిన పనిలేదు. మన ఇంట్లో లభించే పదార్థాలతోనే సహజసిద్ధంగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో ఐస్ క్యూబ్స్ ఎంతగానో పనిచేస్తాయి. కళ్ల కింద రక్త నాళాలను ప్రశాంతంగా మారుస్తాయి. దీంతో ఆ భాగంలో రక్త సరఫరా మెరుగు పడి కళ్ల కింద ఉండే వాపులు, డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. ఇందుకు గాను ఒక శుభ్రమైన వస్త్రంలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి వాటితో కళ్ల కింద 10 నుంచి 15 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే డార్క్ సర్కిల్స్ త్వరగా మాయమవుతాయి. ముఖం అందంగా మారి కాంతివంతంగా కూడా కనిపిస్తుంది. చాలా మందికి నిద్ర లేకపోవడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి. కనుక రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోతే చాలా వరకు డార్క్ సర్కిల్స్ వాటంతట అవే తగ్గిపోతాయి. నిద్ర వల్ల కళ్ల కింద ఉండే చర్మం మరమ్మత్తులకు గురవుతుంది. కొత్త కణాలు ఏర్పడుతాయి. దీంతో డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. కనుక కచ్చితంగా తగినన్ని గంటలపాటు నిద్రించాలి.
కీరదోస ముక్కలు కూడా ఈ సమస్య నుంచి మనల్ని బయట పడేస్తాయి. ఇందుకు గాను కీరదోసను అడ్డంగా చక్రాల్లా 2 ముక్కలు కట్ చేసి వాటిని ఒక్కో కంటిపై ఉంచాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు రోజూ ఇలా చేస్తుంటే కళ్ల కింద ఉండే వాపు తగ్గిపోతుంది. డార్క్ సర్కిల్స్ పూర్తిగా తొలగిపోతాయి. కీరదోసలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సిలికా చర్మాన్ని సంరక్షిస్తాయి. కనుకనే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. అలాగే టీ బ్యాగ్స్ ను కూడా ఉపయోగించవచ్చు. కాఫీ, టీ లేదా గ్రీన్ టీ బ్యాగ్స్‌ను ఉపయోగించిన తరువాత వాటిని ఫ్రిజ్‌లో 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచి చల్లార్చాలి. అనంతరం వాటిని కళ్లపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు డార్క్ సర్కిల్స్‌ను తొలగిస్తాయి. రోజూ ఇలా చేస్తుంటే తప్పక ఫలితం ఉంటుంది.
బాదంనూనెలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. చర్మానికి కాంతిని ఇస్తుంది. రాత్రి పూట నిద్రించే ముందు కళ్ల కింద కొద్దిగా బాదం నూనె రాయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే డార్క్ సర్కిల్స్ పూర్తిగా తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే విటమిన్ ఇ ఆయిల్ కూడా ఇలాగే పనిచేస్తుంది. దీన్ని కూడా రాత్రి పూట కళ్ల కింద రాయవచ్చు. లేదా బాదంనూనె, విటమిన్ ఇ ఆయిల్ రెండింటినీ కలిపి కొన్ని చుక్కల చొప్పున తీసుకుని ఆ మిశ్రమాన్ని కూడా కళ్ల కింద రాయవచ్చు. దీంతోనూ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే రోజూ తగినన్ని నీళ్లను తాగడం వల్ల కూడా చర్మం తేమగా ఉంటుంది. డార్క్ సర్కిల్స్ ఏర్పడకుండా నివారించవచ్చు. సూర్యకాంతిలో బయటకు వెళ్లేటప్పుడు కళ్ల కింద, ముఖానికి ఎస్ఎపీఎఫ్ 30 లేదా అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన సన్ ప్రొటెక్షన్ క్రీమ్‌ను రాసుకోవాలి. దీంతోనూ డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. ఇలా కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.