Allergies | సాధారణంగా చాలా మందికి అనేక రకాల అలర్జీలు ఉంటాయి. వాటిల్లో శ్వాస సంబంధిత అలర్జీ కూడా ఒకటి. వాతావరణం మారినప్పుడు లేదా సీజన్ మారినప్పుడు, చలికాలంలో శ్వాస సంబంధిత అలర్జీలు ఉన్నవారికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. గాలిలో ఉండే కాలుష్య కారకాలు, దుమ్ము, ధూళి కణాలు, పుప్పొడి రేణువులను పీల్చడం వల్ల శ్వాస సంబంధిత అలర్జీలు వస్తుంటాయి. దీంతో చర్మంపై దద్దుర్లు వచ్చి దురదగా ఉంటుంది. అలాగే కొందరికి దగ్గు, జ్వరం, ఆస్తమా, ముక్కు దిబ్బడ వంటి అనారోగ్య సమస్యలు సైతం వస్తాయి. అయితే శ్వాస సంబంధిత అలర్జీలు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కొన్ని చిట్కాలను పాటిస్తే శ్వాస సంబంధిత అలర్జీలు తగ్గుతాయి.
శ్వాస సంబంధిత అలర్జీలు తగ్గాలంటే అందుకు హెర్బల్ టీలు అద్భుతంగా పనిచేస్తాయి. మీకు నచ్చిన ఏదైనా హెర్బల్ టీని సేవించవచ్చు. లేదా అశ్వగంధతోనూ హెర్బల్ టీ తయారు చేసి తాగవచ్చు. అశ్వగంధ, బల, విదరి అనే మూలికలను సమాన భాగాలుగా తీసుకుని పొడి చేయాలి. ఒక కప్పు నీటిలో ఆ పొడిని 1 టీస్పూన్ మోతాదులో వేసి 3 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత అందులో 5 నుంచి 10 చుక్కల మహా నారాయణ తైలం వేసి బాగా కలపాలి. ఈ హెర్బల్ టీని 15 నిమిషాలకు ఒకసారి ఒక సిప్లా వేసి తాగాల్సి ఉంటుంది. అలా అయిపోయే వరకు దీన్ని తాగాలి. ఇలా చేస్తుంటే అలర్జీలు తగ్గుతాయి. అయితే మహా నారాయణ తైలం లేకపోతే దానికి బదులుగా నెయ్యిని సైతం వాడుకోవచ్చు. అలాగే శ్వాస సంబంధిత అలర్జీలు తగ్గేందుకు త్రిఫల చూర్ణం కూడా బాగానే పనిచేస్తుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తాగాలి. దీని వల్ల అలర్జీలు తగ్గుతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది.
శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా అలర్జీలు ఉన్నవారు చల్లని వాతావరణంలో ఉండకూడదు. బయట తిరగాల్సి వస్తే మాస్క్ ధరించడం మేలు చేస్తుంది. దీని వల్ల కాలుష్య కారకాలు, దుమ్ము, ధూళి కణాలు, పుప్పొడి రేణువులు ముక్కులో చేరి అలర్జీలను కలిగించకుండా అడ్డుకోవచ్చు. శ్వాస సంబంధిత అలర్జీలు ఉన్నవారికి నెయ్యి కూడా బాగానే పనిచేస్తుంది. రాత్రి పూట నిద్రించడానికి ముందు కొద్దిగా నెయ్యిని తీసుకుని కరిగించి ఒక్కో ముక్కు రంధ్రంలో ఒకటి లేదా రెండు చుక్కల చొప్పున నెయ్యి వేయాలి. ఇలా చేస్తున్నా కూడా సమస్య తగ్గుతుంది. అలాగే శ్వాస అలర్జీలు ఉన్నవారు ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా అలర్జీలు వస్తాయి. కనుక ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
శ్వాస అలర్జీలు ఉంటే తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులను చలికాలంలో లేదా సీజన్ మారినప్పుడు తీసుకోవడం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేస్తే మంచిది. కొవ్వు తీసిన ఉత్పత్తులను అయినా సరే తీసుకోవచ్చు. అలర్జీలు ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులకు వీలైనంత వరకు దూరంగా ఉండడం మేలు. కొందరికి డ్రై ఫ్రూట్స్, ఊరగాయలు, వెనిగర్, బ్రెడ్ వంటి ఆహారాలు పడవు. కొందరికి పల్లీలు తింటే అలర్జీలు వస్తాయి. ఫుడ్ అలర్జీలు ఉన్నవారు కూడా శ్వాస అలర్జీ పట్ల జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ సి ఉండే ఆహారాలను తింటుంటే ఈ సమస్య కొంత వరకు తగ్గుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాలను తీసుకుంటున్నా మేలు జరుగుతుంది. ఈ విధంగా ఆయా చిట్కాలను పాటిస్తూ ఆహారాలను తీసుకుంటుంటే అలర్జీ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.