Sleep | ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, రోజువారీ జీవనశైలిలోని చిన్న చిన్న అలవాట్లపైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు చేసే కొన్ని సాధారణ అలవాట్లు క్రమంగా నిద్ర నాణ్యతను, జీర్ణక్రియను, గుండె ఆరోగ్యాన్ని, జీవక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పడుకునే ముందు ఎక్కువ మొత్తంలో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. అయితే రోజంతా తగినంత నీరు తాగకుండా, రాత్రి ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగడం వల్ల రాత్రి మధ్యలో పలుమార్లు మూత్రానికి లేవాల్సి వచ్చే నాక్టూరియా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని, దీంతో గాఢ నిద్రకు అంతరాయం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పడకపై పడుకున్న తర్వాత మొబైల్ ఫోన్ స్క్రోల్ చేయడం కూడా నిద్రకు శత్రువుగా మారుతుంది. ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి (బ్లూ లైట్) శరీరంలో నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో నిద్ర పట్టడానికి ఎక్కువ సమయం పట్టడమే కాకుండా మధ్యలో మెలకువలు రావడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం లేదా పడుకునే సమయానికి దగ్గరగా ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే సమయానికి మూడు గంటల లోపు భోజనం చేస్తే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) లేదా యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు కనిపించే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల భోజనం చేసిన తర్వాత కొంత సమయం గడిచిన తర్వాత మాత్రమే నిద్రకు వెళ్లడం మంచిదని చెబుతున్నారు.
కొంతమంది ప్రశాంతంగా నిద్రపోవడానికి రాత్రి మద్యం సేవించడం అలవాటు చేసుకుంటారు. అయితే మద్యం వల్ల నిద్ర వచ్చినట్లు అనిపించినా, నిద్ర నాణ్యత తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెదడు విశ్రాంతికి అత్యంత కీలకమైన REM నిద్ర దశ తగ్గిపోవడంతో శరీరం పూర్తిగా కోలుకునే ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో నొప్పి నివారణ మందులు, ముఖ్యంగా ఎన్ఎస్ఏఐడీ (NSAID) వర్గానికి చెందిన మందులను అవసరం లేకుండా తీసుకోవడం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన విషయమని సూచిస్తున్నారు. నిద్ర సమయంలో కడుపు లోపలి రక్షణ పొర పునరుద్ధరణ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఈ మందులు జీర్ణాశయంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కాఫీ తాగడం కూడా రాత్రి నిద్రను ప్రభావితం చేస్తుంది. కాఫీలో ఉండే కెఫీన్ శరీరంలో ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ప్రభావం చూపుతుంది. అందువల్ల మధ్యాహ్నం లేదా సాయంత్రం తాగిన కాఫీ ప్రభావం రాత్రి వరకు కొనసాగి నిద్ర పట్టడాన్ని ఆలస్యం చేస్తుంది.
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోకుండా ఎప్పుడో ఒకప్పుడు ఆలస్యంగా, మరికొన్ని రోజులు త్వరగా పడుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిద్ర సమయాల్లో కేవలం ఒక గంట తేడా వచ్చినా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, ట్రైగ్లిసరైడ్లు అధికం కావడం, ఊబకాయం వంటి జీవక్రియ సంబంధిత సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మంచి నిద్ర కోసం రోజంతా తగినంత నీరు తాగడం, రాత్రి భోజనం ముందుగానే ముగించడం, పడుకునే ముందు మొబైల్ ఫోన్కు దూరంగా ఉండడం, మద్యం, కెఫీన్ను పరిమితం చేయడం, ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం వంటి అలవాట్లను పాటించడం దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.