Cancer Symptoms : క్యాన్సర్ వ్యాధి ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి పేరు వింటేనే భయం ఆవహిస్తుంది. ఏటా లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కూడా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే విజయవంతంగా చికిత్స చేయవచ్చు. కానీ ప్రారంభ దశలో దీని లక్షణాలను గుర్తుపట్టడం అంత సులువు కాదు. ఎందుకంటే దాదాపు 90 శాతం మందికి అవి క్యాన్సర్ లక్షణాలు అని కూడా తెలియదు. అందుకే ప్రతి ఒక్కరూ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలపై అవగాహన పెంచుకోవాలి.
వైద్యులు చెబుతున్న ప్రకారం.. నోటిలో తరచూ పుండ్లు ఏర్పడటం సాధారణ విషయం కాదు. ఇది క్యాన్సర్ జబ్బు చూపించే లక్షణాల్లో ఒకటి. ఈ ప్రీ క్యాన్సర్ లక్షణాన్ని వైద్యులు స్టేజ్ జీరో అని పిలుస్తారు. అయితే నోట్లో పుండ్లు అనేది కచ్చితంగా క్యాన్సర్ లక్షణమే అని చెప్పలేం. కానీ కొన్నిసార్లు మాత్రం అవి క్యాన్సర్ వల్లే్ వచ్చిన పుండ్లే కావచ్చు.
నాలుకపై తెల్లని మచ్చలు కనిపించినా దాన్ని క్యాన్సర్కు ముందు కనిపించే లక్షణంగా అనుమానించవచ్చు. కాబట్టి నాలుకపై తెల్ల మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది కూడా స్టేజ్ జీరోలో కనిపించే సాధారణ లక్షణం. అయితే ఈ తెల్ల మచ్చలకు నోటి ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. తరచూ పొట్ట సంబంధిత వ్యాధులు వస్తున్నా కూడా తేలికగా తీసుకోవద్దు.
తరచూ మలబద్ధకం సమస్య కనిపిస్తున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. మళ్లీమళ్లీ మలబద్ధకం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మీ బరువు వేగంగా తగ్గుతున్నా కూడా తేలికగా తీసుకోవద్దు. అలా జరిగిందంటే మీ శరీరంలో ఏదో అసాధారణంగా జరుగుతోందని అర్థం. అలాంటి పరిస్థితిలో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఇవేగాక శరీరంపై ఎక్కడైనా గడ్డలా ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆ గడ్డలు కూడా క్యాన్సర్కు ప్రారంభ సంకేతం కావచ్చు. మీ శరీరంపై పుట్టుమచ్చ లేదా మొటిమ ఉండి, అది అకస్మాత్తుగా పెరుగుతున్నా తేలికగా తీసుకోకూడదు. అది కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. తీవ్రంగా అలసిపోవడం కూడా క్యాన్సర్ లక్షణాలలో ఒకటి. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు.
సాధారణంగా మనిషి అలసిపోతాడు. కానీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు అలసటగా అనిపిస్తున్నా, చిన్న పని చేయడానికి కూడా శక్తి లేనట్టు ఉన్నా జాగ్రత్త పడాలి. ఎక్కువ రోజులు ఇలా కొనసాగితే వైద్యులను సంప్రదించాలి. శరీరం రంగు నల్లగా మారడం లేదా ఎర్రగా మారి దురద పెట్టడం కూడా అసాధారణమైన క్యాన్సర్ లక్షణమే. ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు.
చిన్నచిన్న గాయాలు అయినా మానకపోవడం, పుట్టమచ్చల సైజు పెరిగి పుండ్లుగా మారడం కూడా క్యాన్సర్ లక్షణమే కావచ్చు. గొంతు మారడం, విపరీతమైన దగ్గు రావడం కూడా క్యాన్సర్ లక్షణాలలో ఒకటే. మీ స్వరం మారిందంటే మీ శరీరంలో ఏదో తేడా ఉందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పిన ఏ లక్షణం మీలో ఉన్నా ఒకసారి వైద్యులను కలిసి జాగ్రత్త పడటం మంచిది.