Walnuts : బాగా ఖరీదైన వాల్ నట్స్‌ను ఒకప్పుడు బాగా డబ్బులు ఉన్నవారు మాత్రమే తినేవారు. అందుకే ఖరీదైన పంట కావడం, డిమాండ్ తక్కువగా ఉండటం కారణంగా చాలా తక్కువగా వాల్ నట్స్‌ను సాగుచేసే వారు. అయితే వాల్ నట్స్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన తర్వాత వీటికి డిమాండ్ పెరిగింది. మధ్యతరగతి ప్రజలు కూడా వాల్‌నట్స్‌ను తమ ఆహారంలో బాగం చేసుకుంటున్నారు. దాంతో విదేశాల్లో ఉత్పత్తి అయ్యే టాప్-10 వ్యవసాయ ఉత్పత్తుల్లో వాల్నట్స్ కూడా చేరాయి. మరి వాల్‌నట్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. నిజానికి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే గింజల్లో వాల్నట్స్ కూడా ఒకటి. వీటిలో ఉండే ప్రత్యేక గుణాలు గుండెజబ్బుల నుంచి రక్షణనిస్తాయి.
వాల్‌నట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని వృద్ధాప్యంతో వచ్చే మానసిక క్షీణతను నెమ్మదించేలా చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి మీ జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి.
మీ పేగులు, పేగులలోని బ్యాక్టీరియా సూక్ష్మజీవులు కూడా మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో అవసరం. వాల్నట్లు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్‌లోనూ ఇదే విషయం వెల్లడైంది. ప్రతిరోజూ వాల్‌నట్స్‌ను తినేవారు ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను కలిగి ఉన్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
మీ గట్‌లోని సూక్ష్మజీవులు వాల్నట్లలో ఉండే సమ్మేళనాలను తీసుకుంటాయి. తర్వాత యురోలిథిన్ సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ యురోలిథిన్ సమ్మేళనాలు కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి. క్యాన్సర్ల నివారణలో వాల్నట్ల పాత్రను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
వాల్‌నట్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిలో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వాల్‌నట్స్‌లోని ఆరోగ్యకరమైన అన్సాచురేటెడ్ కొవ్వులు మిమ్ములను ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఒక ఔన్స్ వాల్‌నట్స్‌లో 190 కేలరీలు ఉన్నప్పటికీ, కేవలం 145 మాత్రమే ఉపయోగపడతాయని ఒక అధ్యయనంతో తేలింది. వాల్నట్లు మనకు అవసరమైన ఐరన్, మెగ్నీషియంను కూడా అందిస్తాయి.