Roasted Garlic | వెల్లుల్లిని మనం నిత్యం వంటల్లో వేస్తూనే ఉంటాం. వెల్లుల్లిని వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. మసాలా లేదా నాన్ వెజ్ వంటకాల్లో, ఇతర కూరల్లోనూ వెల్లుల్లిని ఎక్కువగా వాడుతారు. అయితే ఆయుర్వేద ప్రకారం వెల్లుల్లి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వెల్లుల్లిని నేరుగా అలాగే పచ్చిగా తింటే అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. అయితే వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది కనుక దాన్ని నేరుగా తినలేరు. కానీ వెల్లుల్లి రెబ్బలను పెనంపై కాస్త వేయిస్తే ఎంతో రుచిగా ఉండడమే కాదు, వాటిని చాలా సులభంగా తినవచ్చు. వెల్లుల్లి రెబ్బలను వేయించి తింటున్నా కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి. రోజూ 2 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలను పెనంపై కాస్త వేయించి ఉదయం పరగడుపునే తింటుండాలి. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు.
వెల్లుల్లి రెబ్బలను వేయించి తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి వెల్లుల్లి రెబ్బలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి వెల్లుల్లి రెబ్బలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిని రోజూ ఉదయం పరగడుపునే వేయించి తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, ఫ్లూ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సహజసిద్ధమైన యాంటీ బయోటిక్ పదార్థంగా పనిచేస్తుంది. అందువల్ల వెల్లుల్లి రెబ్బలను తింటుంటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వ్యాధుల నుంచి బయట పడవచ్చు. శరీరంలోని అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్ లు నశిస్తాయి. ఆరోగ్యంగా ఉంటాము.
వెల్లుల్లి రెబ్బల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. లివర్ లోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లేలా చేస్తాయి. దీని వల్ల లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. అలాగే శరీరంలోని టాక్సిన్లు సైతం బయటకు వెళ్లిపోతాయి. వెల్లుల్లి రెబ్బలను తింటుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే పురుగులు, క్రిములు నశిస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా కూడా పనిచేస్తాయి. అందువల్ల వెల్లుల్లి రెబ్బలను వేయించి తింటుంటే ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెల్లుల్లిని వేయించడం వల్ల కాస్త ఘాటుదనం తగ్గుతుంది. దీని వల్ల వాటిని సులభంగా తినవచ్చు. కానీ వెల్లుల్లిలో ఉండే ఆల్లిసిన్ అనే సమ్మేళనం శాతం తగ్గుతుంది. కనుక పచ్చి వెల్లుల్లి రెబ్బలను అయితే రెండు తింటే చాలు. అదే వేయించిన వెల్లుల్లి రెబ్బలను అయితే నాలుగు తినాల్సి ఉంటుంది. దీని వల్ల పోషకాలను కోల్పోకుండా చూసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను వేయించినా కూడా నేరుగా తినలేని వారు వాటిని ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్లో కలిపి తినవచ్చు. వెల్లుల్లి రెబ్బలను పరగడుపునే తింటే కొందరికి గ్యాస్, కడుపులో మంట వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరికి వేడి చేస్తుంది. కనుక అలాంటి వారు వెల్లుల్లి రెబ్బలను తినకూడదు. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ వెల్లుల్లి రెబ్బలను తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.