Belly Fat | నేటి కాలంలో మన ఆహారపు అలవాట్లల్లో, జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో మనలో చాలా మంది ఊబకాయం, అధిక బరువు ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరిలో శరీరం సన్నగా ఉన్నప్పటికీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. సమతుల్య ఆహారాన్ని తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఉప్పు, నూనె కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి వివిధ కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల అధిక రక్తపోటు, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం చాలా సులభంగా పొట్ట చుట్టూ చేరిన కొవ్వును తొలగించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించడం కూడా చాలా సులభం.
ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల పొట్ట చుట్టూ చేరిన కొవ్వు తొలగిపోతుంది. శారీరక వ్యాయామం చేయడం వల్ల కొవ్వు కరగడంతోపాటు శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. బరువులు ఎత్తడం, సిట్ అప్స్, క్రంచెస్ వంటివి చేయడం వల్ల పొట్ట చుట్టూ చేరిన కొవ్వు కరిగిపోతుంది. సమతుల్య ఆహారం కూడా కొవ్వును కరిగించడంలో మనకు ఎంతో సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, నూనెలో వేయించిన పదార్థాలు, కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. కొవ్వును తగ్గించడంలో మిరపకాయలు ఎంతో తోడ్పడతాయి. ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తగిన మోతాదులో మిరపకాయలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు తగ్గుతాయి. తద్వారా పొట్ట చుట్టూ చేరిన కొవ్వు కూడా తగ్గుతుంది. శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. పసుపులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. శరీర బరువును తగ్గించడంలో, కొవ్వును కరిగించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పసుపు కలిపి తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు వేగంగా కరుగుతుంది. మన వంటగదిలో ఉండే దినుసులల్లో జీలకర్ర కూడా ఒకటి. జీలకర్ర అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆహారంలో జీలకర్రను భాగంగా చేసుకోవడంతోపాటు జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల అధిక బరువుతో బాధపడే వారు మంచి ఫలితాలను చూడవచ్చు.
శరీరంలో జీవక్రియ వేగాన్ని పెంచడంలో నిమ్మకాయ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. పొట్ట చుట్టూ చేరిన కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ ఎంతో సహాయపడుతుంది. టీ, కాఫీలకు బదులుగా రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల శరీర బరువు అదుపులో ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అలాగే ప్రతిరోజూ యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి కారణంగా కూడా శరీర బరువు పెరుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది. ఈవిధంగా ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ చేరిన కొవ్వును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.