White Bread | వైట్ బ్రెడ్‌ను సాధారణంగా చాలా మంది తరచూ తింటూనే ఉంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం అవుతుందని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుని తింటారు. అలాగే బ్రెడ్‌తో పలు రకాల తీపి వంటకాలను సైతం చేసుకుంటారు. అయితే వైట్ బ్రెడ్‌ను తినడం మంచిదేనా..? అసలు దాన్ని దేంతో తయారు చేస్తారు..? దీన్ని తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి..? ఎలాంటి నష్టాలు ఉంటాయి..? అన్న వివరాలను వైద్యులు, పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. వైట్ బ్రెడ్‌ను చాలా మంది వాస్తవానికి ఆరోగ్యకరమైందని అనుకుంటారు. జ్వరం వచ్చినప్పుడు తేలిగ్గా జీర్ణమవుతుందని చెప్పి పాలలో వైట్ బ్రెడ్ ముంచుకుని తింటారు. అయితే వాస్తవానికి వైట్ బ్రెడ్ మన ఆరోగ్యానికి అసలు ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు. దీన్ని అతిగా తింటే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వైట్ బ్రెడ్‌ను చాలా వరకు మైదా పిండితోనే తయారు చేస్తారు. మీరు బ్రెడ్ ప్యాకెట్‌పై అది దేనితో తయారైందో చూసి తెలుసుకోవచ్చు. గోధుమ పిండిని నేరుగా ఉపయోగించరు. దాన్ని బాగా రీఫైన్ చేసి అప్పుడు దాంతో బ్రెడ్ తయారు చేస్తారు. కొందరు పాలతో తయారు చేశామని చెప్పి మిల్క్ బ్రెడ్‌ను విక్రయిస్తున్నారు. కానీ అందులో పాల శాతం ఎంత ఉందో, పిండి శాతం ఎంత ఉందో కచ్చితంగా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. వైట్ బ్రెడ్‌ను చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం అని అనుకుంటారు. ఎప్పుడో ఒకసారి తింటే ఫర్వాలేదు. కానీ తరచూ ఈ బ్రెడ్‌ను అసలు తినకూడదు. ఇది ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. వైట్ బ్రెడ్ తయారీకి ఉపయోగించే మైదా పిండి లేదా రీఫైన్ చేయబడిన గోధుమ పిండి మనకు రోగాలను కలిగిస్తుంది.
వైట్ బ్రెడ్‌లో సాధారణంగా పోషకాలు ఏమీ ఉండవు. ఒక వేళ ఉన్నా కూడా చాలా స్వల్ప మోతాదులో ఉంటాయి. వైట్ బ్రెడ్‌ను తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. దీని వల్ల దీర్ఘకాలంలో శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది. వైట్ బ్రెడ్ వల్ల మన శరీరానికి క్యాలరీలు అధికంగా లభిస్తాయి. ఇవన్నీ కొవ్వుగా మారి నిల్వ ఉంటాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. ఇది ఇంకా ఇతర అనేక సమస్యలను కలగజేస్తుంది. వైట్ బ్రెడ్ తయారీకి ఉపయోగించే పిండిని ప్రాసెస్ చేసేందుకు గాను పొటాషియం బ్రోమేట్, అజోడి కార్బొనమైడ్, క్లోరిన్ డయాక్సైడ్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. కనుక వైట్ బ్రెడ్ తినడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అలాంటి పిండితో తయారు చేసిన బ్రెడ్‌ను తింటే స్థూలకాయం బారిన పడతారు. దీంతో గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
వైట్ బ్రెడ్ గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా అధికంగా ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి ఈ బ్రెడ్ అసలు మంచిది కాదు. ఈ బ్రెడ్‌ను తరచూ తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వైట్ బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ లేదా హోల్ గ్రెయిన్ బ్రెడ్ ను తింటే మంచిది. వీటిల్లో ఫైబర్‌తోపాటు పోషకాలు కాస్త ఎక్కువ శాతం ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కనుక ఇకపై బ్రెడ్‌ను తింటే వైట్ బ్రెడ్‌కు బదులుగా ఆయా బ్రెడ్లను తినడం మంచిది. దీని వల్ల రోగాల బారిన పడకుండా ఉంటారు.