Uric Acid Levels | మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పెరిగిన ఒత్తిడి మనల్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. చాలా మంది షుగర్, ఊబకాయం వంటి సమస్యలే ప్రధాన సమస్యలు అనుకుంటారు. కానీ మనకు కనబడని సమస్యల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం కూడా ఒకటి. శరీరంలో విడుదల అయ్యే వ్యర్థాల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. ఇది సాధారణంగా మూత్రం ద్వారా బయటకు పోతుంది. మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేనప్పుడు ఇది రక్తంలో క్రమంగా పేరుకుపోతుంది. దీనిని వైద్యపరంగా హైపర్ యూరిసెమియా అంటారు. పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయిలు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలకు దారితీస్తాయి. అంతేకాకుండా రక్తంలో అధికంగా ఉండే ఈ యూరిక్ యాసిడ్ కీళ్లు, కణజాలాల్లో స్ఫటికాలుగా మారుతుంది. దీంతో కీళ్ల నొప్పులు, వాపు, గౌట్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
అంతేకాకుండా స్ఫటికాలు ఏర్పడిన చోట చర్మం ఎర్రగా మారడం, పుండ్లు పడడం కూడా జరుగుతుంది. సాధారణంగా మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు డెసిలీటర్ కు 3.5 నుండి 7.2 మిల్లీగ్రాముల మధ్య ఉంటాయి. అలాగే ఈ స్థాయిలు స్త్రీలలో డెసిలీటర్ కు 6 మిల్లీగ్రాములు, పురుషుల్లో డెసిలీటర్ కు 7 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తెలుసుకోవడానికి వైద్యున్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు లేదా యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకునే వారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు తీసుకోకూడని ఆహారాల గురించి వైద్యులు వివరిస్తున్నారు.
ముందుగా చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి. అలాగే మద్యపానం చేయకూడదు. ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. శరీరంలోకి ప్రవేశించిన తరువాత ప్యూరిన్ యూరిక్ యాసిడ్ లాగా విచ్ఛిన్నమవుతుంది. దీంతో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. కనుక ప్యూరిన్ కలిగిన ఆహారాలను తీసుకోకపోవడం మంచిది. సోయాబీన్స్ ను తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. సోయా ప్రోటీన్ యూరిక్ యాసిడ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. కనుక సోయాబీన్స్ ను ఆహారంగా తీసుకోవడం తగ్గించాలి. కానీ సోయాటోఫు మాత్రం యూరిక్ యాసిడ్ స్థాయిలపై అంతగా ప్రభావాన్ని చూపించడం లేదు. రెడ్ మీట్ తినేవారిలో శాకాహారుల కంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేస్తున్నారు. అందువలన రెడ్ మీట్ ను తీసుకోవడం తగ్గించాలి. ప్యూరిన్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
మనలో చాలా మంది కాలేయం, ప్రేగులు వంటి అవయవ మాంసాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. వీటిలో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి. దీంతో గౌట్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక అవయవ మాంసాన్ని కూడా తక్కువగా తీసుకోవడం మంచిది. రొయ్యలు, పీతలు, మస్సెల్స్, సార్డిన్స్ వంటి సముద్ర ఆహారాల్లో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. కనుక ఈ ఆహారాలను కూడా తగిన మొత్తంలో తీసుకోవాలి. శీతల పానీయాల్లో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. కానీ వీటిలో ఎక్కువ మొత్తంలో ప్రక్టోజ్ ఉంటుంది. యూరిక్ స్థాయిలను పెంచే ఏకైక కార్బోహైడ్రేట్ ఈ ప్రక్టోజ్. కనుక శీతల పానీయాలను కూడా తీసుకోవడం తగ్గించాలి. రక్తంలో పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయిలు మొత్తం శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కనుక శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిల సమతుల్యానికి ప్యూరిన్లు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటూ యూరిక్ యాసిడ్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ చక్కని జీవనశైలిని పాటించడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు.