Chia Seeds | ప్రస్తుత కాలంలో ఆరోగ్యం మీద స్పృహ పెరగడంతో మనలో చాలా మంది ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను ఎంచుకుంటున్నారు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో చియా విత్తనాలు ఒకటి. ప్రస్తుత కాలంలో వీటి వాడకం పెరిగిందని చెప్పవచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చియా విత్తనాలు పోషకాలతో నిండి ఉంటాయి, వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సీడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా చియా విత్తనాలు మనకు మేలు చేస్తాయి. అయితే మనలో చాలా మంది ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని వీటిని ఎలా పడితే అలా ఆహారంగా తీసుకుంటున్నారు. కానీ వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలని లేదంటే ఆరోగ్యానికి మేలు కలగడానికి బదులుగా హాని కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చియా విత్తనాలను ఏయే ఆహారాలతో కలిపి తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్యాక్ చేసిన పండ్లరసాలతో కలిపి చియా విత్తనాలను తీసుకోకూడదు. ప్యాక్ చేసిన పండ్ల రసాల్లో చక్కెరతో పాటు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఆరోగ్యానికి కూడా హాని కలిగే అవకాశం ఉంది. కనుక చియా విత్తనాలను బాదం పాలు లేదా నీటితో కలిపి తీసుకోవాలి. రిచ్ డైరీ ప్రొడక్ట్స్ తో కూడా చియా విత్తనాలను కలిపి తీసుకోకూడదు. డైరీ ప్రొడక్ట్స్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. చియా విత్తనాల వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలు శరీరానికి అందవు. కనుక చియా విత్తనాలను మొక్కల ఆధారిత పాలతో కలిపి తీసుకోవాలి. ఫైటిక్ యాసిడ్ అధికంగా ఉండే గింజలు, బీన్స్, కాయ ధాన్యాలతో చియా విత్తనాలను కలిపి తీసుకోకూడదు. ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలు మన శరీరం క్యాల్షియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలను గ్రహించకుండా నిరోధిస్తాయి. దీని వల్ల చియా విత్తనాల్లో ఉండే పోషకాలు మన శరీరానికి పూర్తిగా అందవు.
సిట్రస్ పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వీటిని చియా విత్తనాలతో కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక చియా విత్తనాలను అరటిపండ్లు, ఆపిల్ వంటి వాటితో కలిపి తీసుకోవాలి. అలాగే చియా విత్తనాలను తీసుకునే ముందు లేదా తీసుకున్న తరువాత కెఫిన్ ఉండే పానీయాలను తీసుకోకూడదు. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురి చేయడంతో పాటు చియా విత్తనాల్లో ఉండే పోషకాలు శరీరానికి అందకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక కెఫిన్ లేని పానీయాలను తీసుకోవడం మంచిది.
అదే విధంగా ఆల్కహాల్ తీసుకున్న కొన్ని గంటల తరువాత మాత్రమే చియా విత్తనాలను తీసుకోవాలి. ఇవి రెండింటిని కలపడం వల్ల జీర్ణవ్యవస్థకు హాని కలుగుతుంది. ఉబ్బరం, పొట్టలో చికాకు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. హెర్బల్ టీ లేదా నీటితో చియా విత్తనాలను కలిపి తీసుకోవడం వల్ల పోషకాలు బాగా గ్రహించబడతాయి. ఇక స్పైసీ ఫుడ్స్ ను, చియా విత్తనాలను కలిపి తీసుకోకూడదు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల మంచి కంటే హానే ఎక్కువగా కలుగుతుంది. చియా విత్తనాలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ వీటిని ఇప్పుడు చెప్పిన ఆహారాలతో కలిపి తీసుకోవడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చియా విత్తనాలను సరైన పద్దతిలో తీసుకున్నప్పుడే వీటిలో ఉండే పోషకాలు మన శరీరానికి అందడంతో పాటు వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయని వైద్యులు చెబుతున్నారు.